కన్నెపల్లి పంప్‌‌హౌస్‌ మునిగిపోవడానికి అసలు కారణమేంటి..?

కన్నెపల్లి పంప్‌‌హౌస్‌ మునిగిపోవడానికి అసలు కారణమేంటి..?

అందుకే పంప్ హౌస్ నుంచి నీళ్ల తొలగింపు ఆలస్యం 
జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు :
కన్నెపల్లి పంప్‌‌హౌస్‌ మునిగిపోవడానికి కారణమేంటనే దానిపై రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. రూ.వేల కోట్లతో కట్టిన ఈ పంప్‌‌హౌస్‌లోని 17 మోటార్లకు రక్షణగా సిమెంట్‌‌ ‌తో కట్టిన ఫోర్‌‌ బేస్‌‌ మెంట్‌‌ గోడ కూలిపోవడంతోనే బాహుబలి మోటార్లు మునిగిపోయాయని అందరూ అనుకున్నారు. ఇది నిజమే. కానీ కొత్తగా ఇప్పుడు పంప్‌‌హౌస్‌ హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ గేట్లు కూడా పగిలిపోయాయనే విషయం తెలిసింది. అందుకే పంప్ హౌస్ నుంచి నీళ్ల తొలగింపు ప్రక్రియ ఆలస్యం అవుతోందని సమాచారం. గోదావరి వరదకు ఈ నెల 14న కన్నెపల్లి, అన్నారం పంప్‌‌హౌస్‌లు మునిగిపోయాయి. అయితే అన్నారం దగ్గర 16 నుంచే నీళ్ల తొలగింపు ప్రారంభమైంది. ఒకట్రెండు రోజుల్లో మునిగిపోయిన 12 మోటార్లు బయటపడతాయని అధికారులు అంటున్నారు. కానీ కన్నెపల్లిలో మాత్రం ఇప్పటి వరకు నీళ్ల తొలగింపు మొదలు కాలేదు. గోదావరిలో వరద తగ్గుముఖం పట్టాలని, కరెంట్‌‌ లేదని, జనరేటర్లు తెప్పిస్తున్నామని... ఇలా అధికారులు రోజుకో ముచ్చట చెబుతూ పనులు ఆలస్యం చేస్తున్నారు. అంతా సీక్రెట్ గా ఉంచుతూ పంప్ హౌస్ దగ్గరికి ఎవరూ రాకుండా పోలీస్ బందోబస్తు పెట్టారు. 

ఇంజనీర్లలో చర్చ...  
నిజానికి పంప్‌‌హౌస్‌, ఫోర్‌ ‌బేలోని నీళ్లను తోడేయడం మేఘా లాంటి కాంట్రాక్టు సంస్థకు పెద్ద పనేమీ కాదు. కరెంట్‌ ఉన్నా లేకపోయినా జనరేటర్ల సహాయంతో 100, 200 హెచ్‌‌పీ మోటార్లను పెట్టి నీళ్లను తోడేయొచ్చు. కానీ అసలు విషయమేమిటంటే గోదావరి నుంచి ఫోర్‌‌ బేలోకి నీటిని పంపించేందుకు ముందుగా హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ నిర్మించి 10 గేట్లు అమర్చారు. ఈ గేట్లను తెరిస్తే గోదావరి నీళ్లు ఫోర్‌‌ బేలోకి వస్తాయి. అప్పుడు మోటార్లను ఆన్‌‌ చేసుకోవచ్చు. గేట్లు మూసేస్తే గోదావరి వరద ఫోర్‌‌ బేలోకి రాదు. అయితే మొన్నటి వానలకు పంప్‌‌హౌస్‌ ఫోర్‌‌ బేస్‌‌ మెంట్‌‌ గోడ పగిలిపోవడంతో పాటు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ గేట్లు కూడా పగిలిపోయాయని ఇంజనీర్లు చర్చించుకుంటున్నారు. ఈ గేట్లను సరి చేయకుండా ఫోర్‌‌ బే, పంప్‌‌హౌస్‌లోని నీళ్లను తోడడానికి మోటార్లను అమర్చితే.. ఎన్ని రోజులు డీవాటరింగ్‌‌ చేసినా గోదావరి నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయని మాట్లాడుకుంటున్నారు. అందుకే ముందుగా గేట్లను సరి చేసి, వరద ఫోర్‌ ‌బేలోకి రాకుండా ఆపాలని భావిస్తున్నారు. ఈ విషయమై మంచిర్యాల ఈఎన్‌‌సీ వెంకటేశ్వర్లు వివరణ కోరగా.. హెడ్‌‌ రెగ్యులరేటర్‌‌ దగ్గరి నుంచి ఫోర్‌‌ బేలోకి వాటర్‌‌ లీకవుతున్న మాట నిజమేనని చెప్పారు. గేట్లు పగిలిపోయాయా? లేక పక్క నుంచి నీళ్లు వస్తున్నాయా? అనే విషయం త్వరలో తెలుస్తుందన్నారు.