ప్రజావాణి వినేదెప్పుడు?

ప్రజావాణి వినేదెప్పుడు?

హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యలను చెప్పుకుందామంటే వినేవారు లేరు. అధికారుల దృష్టికైనా తీసుకెళ్దామంటే ఆ అవకాశం కూడా లేదు. కరోనాకు ముందు ప్రతి సోమవారం బల్దియా ఆఫీసులు, కలెక్టరేట్​లో ప్రజావాణి నిర్వహించేవారు. బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులు చేసేవారు. వాటికి సంబంధిత అధికారులు పరిష్కారం చూపేవారు. ఉన్నతాధికారులు కొన్ని సమస్యలను వెంటనే విచారించేవారు.  కరోనా తో  రెండేండ్ల కిందట బంద్​చేసిన ప్రజావాణి ప్రోగ్రామ్​ఇప్పటికీ నిర్వహించడంలేదు. కొవిడ్​కు ముందు  నిర్వహించగా బల్దియా డిప్యూటీ కమిషనర్ ఆఫీసుల్లో 30 , జోనల్​ఆఫీసులో 50 , హెడ్డాఫీసులో 100 చొప్పున  ఫిర్యాదులు వచ్చేవి. ఇలా గ్రేటర్​పరిధిలో వెయ్యికిపైగా బాధితులు వచ్చేవారు. కలెక్టరేట్లలోనూ దాదాపు 50 వరకు వచ్చేవి. ప్రతివారం వందలాది మంది బాధితులు వెళ్లి తమ సమస్యలపై చెప్పుకుంటే తక్షణమే పరిష్కారం దొరికేది. ప్రస్తుతం కరోనా సాధారణ పరిస్థితులు ఉన్నా ప్రజావాణి ప్రారంభించేందుకు అధికారులు ఆసక్తి చూపడంలేదు. ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఆన్ లైన్ లో చేయండని సలహాలు ఇస్తున్నారు. హెల్ప్​ లైన్ నంబర్​, మై జీహెచ్ఎంసీ యాప్, ట్విట్టర్, డయల్100కి  ఫిర్యాదు చేసినా పరిష్కరించడంలేదు. చాలామందికి టెక్నాలజీ అవగాహన లేకపోవడం కూడా సమస్యగా మారింది. దీంతో బాధితుల సమస్యలు సాల్వ్​కావడంలేదు. 

ఫేస్ టు ఫేస్ ​అయినా పెట్టట్లే..

 ప్రతి నెలా బల్దియా కమిషనర్, ఇతర శాఖల అధికారులతో కలిసి మేయర్ ఫేస్​ టూ ఫేస్ నిర్వహించేవారు. ఇందులో వచ్చిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు పంపించేవారు. గడిచిన నెల ఫిర్యాదుల పరిష్కారంపై వచ్చేనెలలో పరిశీలించేవారు. మేయర్లుగా మాజిద్​హుస్సేన్​, బండ కార్తీకారెడ్డి ఉన్నప్పుడు కార్యక్రమానికి ఫుల్​రెస్పాన్స్​ వచ్చింది. ఆ తర్వాత మేయర్​బొంతు రామ్మోహన్​కూడా కొన్నాళ్లు కొనసాగించి  కరోనాకు ముందు నిలిపేశారు. ఇది కూడా తిరిగి నిర్వహిస్తే ప్రజా సమస్యలు పై స్థాయిలో ఉన్నవారికి కూడా తెలిసే అవకాశం ఉంటుందని జనం పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మేయర్ చొరవ తీసుకొని వచ్చే నెల నుంచి ఫేస్ టూ ఫేస్ ప్రారంభించాలని నగరవాసులు కోరుతున్నారు.

ఫోన్​ చేస్తే స్పందించలె..

ప్రజావాణి నిర్వహణపై అడిగేందుకు బల్దియా కమిషనర్​కు కాల్​చేస్తే లిఫ్ట్​చేయలేదు. రిప్లై ఇవ్వలేదు. డిప్యూటీ కమిషనర్లని అడిగితే తమకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో నిర్వహించడంలేదని చెప్పారు. తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారు..? అనే దానిపైనా క్లారిటీ ఇవ్వలేదు. ఉన్నతాధికారులను అడిగినా సమాధానం లేదు. కరోనా తర్వాత ప్రస్తుతం అన్ని పనులు సాధారణ స్థాయికి వచ్చినా ఇంకా ప్రజావాణి ఎందుకు నిర్వహించడంలేదనేది చర్చనీయాంశమైంది.

సమస్యలు వినలేక బంద్​ పెట్టి..

ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రజావాణిని నిర్వహించకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో జనాలకు తెలియట్లేదు. దీంతో ఆ ఎఫెక్ట్​ ఓ ఎమ్మెల్యే నిర్వహించిన ప్రజాదర్బార్ పై పడింది. వారం కిందట మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు తన సెగ్మెంట్​లోని సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్​ నిర్వహించారు. భారీగా జనం తరలివచ్చి తమ సమస్యలను తెలియజేయడమే కాకుండా కొందరు నిలదీశారు.  మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేయడంతో బంద్​పెట్టి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఆ ప్రజాదర్బార్​లో వేలల్లో ఫిర్యాదులు వచ్చాయంటే ఇక గ్రేటర్ లో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుస్తోంది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా వారిని కలవనివ్వడంలేదు. పోలీసులు మధ్యలోనే అడ్డుకుంటుండగా  ఎవరికి చెప్పుకోవాలంటూ పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రజావాణి నిర్వహిస్తే ఇలాంటి పరిస్థితి తలెత్తదు.

చిన్న రిపేర్​ చేయించలేక పక్కన పడేసిన్రు!

కొండాపూర్ జిల్లా హాస్పిటల్ రంగారెడ్డి జిల్లాలోనే పెద్దది. ఇక్కడికి డైలీ వందల మంది  ఔట్ పేషెంట్లు వస్తుంటారు. శేరిలింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల నుంచి గర్భిణులు చెకప్, డెలివరీల  కోసం వస్తారు. పేషెంట్ల కోసం అంబులెన్సులు అందుబాటులో  ఉంచాలి. కానీ కొండాపూర్ జిల్లా హాస్పిటల్ అధికారులు ఈ విషయంలో  నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అంబులెన్స్ కు ఉన్న చిన్న రిపేర్లను బాగుచేయించకుండా దాన్ని పక్కన పడేశారు. దీంతో హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లు ప్రైవేటు అంబులెన్స్ లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటికైనా హాస్పిటల్ కి చెందిన  అంబులెన్స్ ను రిపేర్ చేయిస్తే బాగుంటుందని పేషెంట్లు కోరుతున్నారు.   
- వెలుగు, గచ్చిబౌలి