డిసెంబర్ 2, 2004 తర్వాత పుట్టారా..? పేరెంట్స్ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే.. తెలంగాణలో జూన్ 25 నుంచి SIR సర్వే

డిసెంబర్ 2, 2004 తర్వాత పుట్టారా..? పేరెంట్స్ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే.. తెలంగాణలో జూన్ 25 నుంచి SIR సర్వే

హైదరాబాద్, వెలుగు: ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్​’(సర్) లక్ష్యమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. సర్ లో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, లింకింగ్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత కోసం పుట్టిన తేదీ ఆధారంగా ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. 

ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా జులై 1, 1987 కంటే ముందు భారతదేశంలో జన్మించిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి తమ పుట్టిన తేదీ లేదా నివాస ధృవీకరణ కోసం ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ చూపితే సరిపోతుందని స్పష్టం చేశారు. అయితే, జులై 1, 1987 నుంచి డిసెంబర్ 2, 2004 మధ్య కాలంలో జన్మించిన దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత పత్రాలతో పాటు, తల్లి లేదా తండ్రిలో ఒకరి వివరాలు లేదా ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. 

ఇక డిసెంబర్ 2, 2004 తర్వాత జన్మించిన వారైతే, తమ సొంత పత్రాలతో పాటు అటు తల్లి, ఇటు తండ్రి ఇద్దరి బర్త్ (జనన) లేదా ప్లేస్ ఆఫ్ బర్త్ (పుట్టిన స్థలం) సర్టిఫికెట్లను కచ్చితంగా జతచేయాల్సి ఉంటుందని సీఈఓ వివరించారు. ఈ వయస్సు ధ్రువీకరణ నమోదు ప్రక్రియ కోసం పాస్‌‌పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రం, విద్యాసంస్థల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్ సహా మొత్తం 12 రకాల పత్రాలను ఎన్నికల సంఘం ప్రామాణికంగా తీసుకోనుందని తెలిపారు. బీఆర్కే భవన్​లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఈవో సుదర్శన్ రెడ్డి మాట్లాడారు.