ట్రిబ్యునల్​ కమిటీ వస్తోందని రాత్రికి రాత్రే అంతా మార్చేసిన్రు

ట్రిబ్యునల్​ కమిటీ వస్తోందని రాత్రికి రాత్రే అంతా మార్చేసిన్రు
  • కర్నాల కుంటకు హద్దులు పాతిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు
  • ఎఫ్​టీఎల్, బఫర్​జోన్​లో నిర్మాణాల తొలగింపు

సూర్యాపేట, వెలుగు: కర్ణాల కుంట చెరువు అక్రమాలు బయట పడకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాత్రికి రాత్రే అంతా మార్చేశారు. ట్రిబ్యునల్ కమిటీ వస్తుందని తెలియడంతో చెరువుకు హద్దులు పాతడంతో పాటు ఎఫ్‌‌టీ‌‌ఎల్, బఫర్ జోన్ నిర్మాణాలను తొలగించారు. సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్​సమీపంలో చెరువు ఆక్రమణపై కుంట ధర్మార్జున్ వేసిన పిటిషన్ ను విచారించిన చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ రిపోర్టు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. కలెక్టర్​నేతృత్వంలోని నలుగురు అధికారుల కమిటీ సమర్పించిన నివేదికను ఎన్జీటీ తిరస్కరించింది.

ఫైవ్ మెన్ కమిటీ ఏర్పాటు చేసి చెరువు ఆక్రమణపై రిపోర్ట్ తయారు చేసి  ఈ నెల 30 వరకు  సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం కర్ణాల కుంట చెరువు తనిఖీకి కమిటీ వస్తుందన్న ముందస్తు సమాచారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలర్ట్​అయ్యారు. రాత్రికి రాత్రే చెరువు చుట్టూ హద్దులు పాతడంతో పాటు ఎఫ్‌‌టీ‌‌ఎల్ పరిధిలోని అక్రమ కట్టడాలను తొలగించారు. అంతేకాకుండా అలుగుకు గండి కొట్టిన ప్రదేశంలో ఎలాంటి ఆనవాళ్లు కనిపించకుండా మట్టిపోసి చదును చేశారు. 
చెరువును పరిశీలించిన  ఫైవ్ మెన్ కమిటీ
కర్ణాలకుంట చెరువు ఆక్రమణపై నిజనిజాలు  తెలుసుకునేందుకు మంగళవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఫైవ్ మెన్ కమిటీ విచారణ చేపట్టింది. పిటిషనర్ కుంట ధర్మార్జున్ తో పాటు సంబంధిత వెంచర్ నిర్వాహకులు, ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్ల సమక్షంలో విచారణ చేపట్టారు. చెరువు బఫర్ జోన్, ఎఫ్‌‌టీ‌‌ఎల్ పరిధి, ట్యాంక్ బండ్ లెవెల్ ను పరిశీలించారు. ఎంక్వైరీ రిపోర్ట్ ను ట్రిబ్యునల్ కు అందిస్తామని కమిటీ మెంబర్స్ చెప్పారు.