రేపే చంద్రయాన్–-3
శ్రీహరికోటలోని షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లనున్న ఎల్‌వీఎం3
శ్రీహరికోట(ఏపీ) : చంద్రయాన్–3 ప్రయోగానికి అంతా సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్‌వీఎం–3 రాకెట్ శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఎల్‌వీఎం3 స్పేస్ క్రాఫ్ట్‌కు ‘ఫ్యాట్‌బాయ్’ అని ఇస్రో సైంటిస్టులు పేరు పెట్టారు. చంద్రయాన్–2 టైంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలు రిపీట్ కాకుండా సైంటిస్టులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రయాన్–3 సక్సెస్ అయితే అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రుడిపై అంతరిక్ష నౌకను దించిన నాలుగో దేశంగా ఇండియా నిలుస్తుంది. ఈ ప్రయోగం చూసేందుకు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
నేటి నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభం
గురువారం నుంచి చంద్రయాన్–3 కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. ఇస్రో అభివృద్ధి చేసిన లాంచ్ వెహికల్స్‌లో ఎల్‌వీఎం 3 అత్యంత శక్తిమంతమైనది, పెద్దది కూడా. అందుకే, సైంటిస్టులు దీనికి ‘ఫ్యాట్ బాయ్’ అని పేరు పెట్టారు. ఎల్‌వీఎం 3 రాకెట్లో ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ ఉంటాయి. ఈ స్పేస్ క్రాఫ్ట్ 43.5 మీటర్ల పొడవు, 640 టన్నుల బరువు ఉంటుంది. ఫ్యాట్‌బాయ్ ఇప్పటి దాకా వరుసగా ఆరు మిషన్లను విజయవంతంగా పూర్తిచేసింది. బరువైన శాటిలైట్లను మోసుకెళ్లిన అనుభవం ఉంది.
16 నిమిషాలకు విడిపోనున్న ప్రొపల్షన్
శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు రాకెట్ నింగికెగిసాక 16 నిమిషాలకు ప్రొపల్షన్ మాడ్యూల్ విడిపోతుంది. 5 నుంచి 6 సార్లు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో తిరిగి చంద్రుడి కక్షవైపు కదులుతుంది. 45 నుంచి 48 రోజుల ప్రయాణం తర్వాత ఆగస్టు 23 లేదా 24న మాడ్యూల్ మెల్లగా సౌత్ పోల్ సమీపంలో ల్యాండ్ అవుతుంది.
నాలుగు సైంటిఫిక్ పేలోడ్స్‌తో డేటా స్టడీ
ల్యాండింగ్‌కి కనీసం 15 నిమిషాల టైం పడుతుంది. అందుకే దీన్ని ‘‘15 మినిట్స్ ఆఫ్ టెర్రర్” అని పిలుస్తారు. సాఫ్ట్ ల్యాండ్ అయ్యాక ల్యాండర్ నాలుగు సైంటిఫిక్ పేలోడ్స్‌ను చంద్రుడి ఉపరితలంపై డిప్లాయ్ చేస్తుంది. అవే చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులను స్టడీ చేస్తాయి. ఈ మాడ్యూల్‌లో స్పెక్ట్రోపొలరిమెటరీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పరికరం అమర్చి ఉంటుంది. ఇది చంద్రుడి పై నుంచి భూమిని అధ్యయనం చేస్తుంది.
రిహార్సల్స్ కంప్లీట్.. లాంచింగ్‌కు రెడీ
‘చంద్రుడిపై ఎలా దిగినా సరే సోలార్ పవర్ ను ఉత్పత్తి చేసేలా ల్యాండర్ ను డిజైన్ చేశాం. మంగళవారం లాంచ్ రిహార్సల్స్‌ను విజయవంతంగా పూర్తిచేశాం. విజయవంతంగా ల్యాండ్ అయ్యేలా కొత్త మిషన్‌ను రూపొం దించాం. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్, రోవర్ సరైన విధంగా తిరగడం, సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్స్ మా ముందున్న లక్ష్యాలు. ల్యాండర్లో ప్రొపెల్లెంట్ లోడింగ్‌ను పెంచడంతో మరింత బలంగా తయారైంది. స్పేస్ క్రాఫ్ట్ వేగం కొలిచేందుకు లేజర్ డాప్లర్ వెలాసిటీ ఎమిటర్ వంటి కొత్త సెన్సార్లు ఏర్పాటు చేశాం’
- సోమనాథ్, ఇస్రో చైర్మన్
