‌కోట్ల విలువైన మోటార్లు.. 5 రోజులుగా వరదలోనే

‌కోట్ల విలువైన మోటార్లు.. 5 రోజులుగా వరదలోనే

జయశంకర్‌ ‌భూపాలపల్లి, వెలుగు: గోదావరి వరదకు మునిగిన కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నీళ్ల తొలగింపు ఇంకా మొదలుకాలేదు. అన్నారం పంప్ హౌస్ వద్ద ఇప్పటికే నీళ్ల తొలగింపు మొదలవ్వగా, ఇక్కడ మాత్రం చర్యలు చేపట్టడం లేదు. దీంతో 5 రోజులుగా రూ.680 కోట్ల విలువైన 17 మోటార్లు నీళ్లలోనే ఉన్నాయి. అసలు పంప్ హౌస్ వద్ద ఏం జరుగుతుందో కూడా అధికారులు చెప్పడం లేదు. అంతా రహస్యంగా ఉంచుతున్నారు. మీడియాతో సహా ఎవరినీ లోపలికి రానివ్వడం లేదు. ఫోన్లు చేస్తే తాము ఎప్పటికప్పుడు మంచిర్యాల ఈఎన్సీకి సమాచారం ఇస్తున్నామని చెబుతున్నారు. ఆయనకు ఫోన్ చేస్తేనేమో తనకు యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో ఉన్నానని జవాబు ఇస్తున్నారు. రిపేర్ల ఖర్చుపై సర్కార్ ఇంకా తేల్చకపోవడంతోనే కాంట్రాక్టు సంస్థ మేఘా పట్టించుకోవడం లేదని పలువురు అంటున్నారు. కాగా, పంప్‌‌హౌస్‌ దగ్గరికి ఎవరూ రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. మహదేవ్‌‌పూర్‌‌ సీఐ కిరణ్‌‌, కాళేశ్వరం ఎస్సైలు లక్ష్మణ్‌‌రావు, నరేశ్‌‌ల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం నుంచి వచ్చే దారిలో గేట్‌‌‒1, హెడ్‌ ‌రెగ్యులరేటర్‌ ‌దగ్గర ఉండే గేట్‌‌‒2, గేట్‌‌‒3, గ్రావిటీ కెనాల్‌‌ నుంచి పంపింగ్‌‌ స్టేషన్‌‌ దగ్గరికి వెళ్లే గేట్‌‌‒4,  గేట్‌–‌5 దగ్గర పోలీసులు మోహరించారు. 

నీళ్ల తొలగింపునకు మూడ్రోజులు.. 

నీళ్లను ఎత్తిపోసి తొందరగా మోటార్లను బయటకు తీస్తేనే రిపేర్ల ఖర్చు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. కానీ అధికారులు గానీ, మేఘా సంస్థ గానీ పట్టించుకోవడం లేదు. ఇంత పెద్ద ఎత్తున డ్యామేజీ జరిగినప్పటికీ ఆఫీసర్లు లోకల్ లో ఉండకుండా మంచిర్యాల, కరీంనగర్‌‌ కు వెళ్లి వస్తున్నారు. కాగా పంప్‌‌హౌస్, ఫోర్‌ ‌బేలో దాదాపు అర టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అవన్నీ ఎత్తిపోయాలంటే కనీసం మూడ్రోజులు పడుతుందని నీటి పారుదల శాఖ ఆఫీసర్లు చెప్పారు. 200 హెచ్‌‌పీ సామర్థ్యం కలిగిన పది, పదిహేను మోటార్లను ఏర్పాటు చేసి 24 గంటలూ నడిపిస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. గోదావరి నుంచి నీళ్లు రాకుండా హెడ్‌‌ రెగ్యులరేటర్‌‌ గేట్లను మూసేసి తొలగింపు ప్రక్రియ చేపడతామన్నారు. మొత్తం నీటిని ఎత్తిపోసిన తర్వాత మోటార్లను పరిశీలించి నష్టం ఎంత జరిగిందో చెబుతామన్నారు.