స్ట్రాంగ్ రూముల్లోకి వెళ్లాలంటే…రూల్స్ చాలా కఠినం

స్ట్రాంగ్ రూముల్లోకి వెళ్లాలంటే…రూల్స్ చాలా కఠినం

ఎన్నికల సమయంలో విధించిన రూల్స్ ను ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా పాటించాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల టైంలోనే కాదు…ముగిసిన తర్వాత రిజల్ట్ వచ్చే వరకు EVM లను భద్ర పరిచే స్ట్రాంగ్ రూంల దగ్గర తీసుకోవాల్సిన భద్రతా చర్యలను కూడా పకడ్బందీగా చేపట్టాలని సూచించింది.

మూడంచెల భద్రత….

ఓట్లు పోలైన EVMలు, VVPATలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తారు. ఆయా జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంలకు తరలిస్తారు. కౌంటింగ్‌ రోజు ఉదయం మాత్రమే ఆ గదులను తెరిచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అప్పటివరకు ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంలోనే ఉంటాయి. వీటి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేస్తారు. స్ట్రాంగ్‌రూమ్‌లకు రెండు తాళాలు వేయాలి. ఒక కీ  జిల్లా ఎన్నికల అధికారి దగ్గర, రెండోది నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దగ్గర ఉంటుంది.

స్ట్రాంగ్‌రూం తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేయాలి. ఎవరూ లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. స్ట్రాంగ్‌రూమ్‌ల చుట్టు పక్కలకు ఎవరూ రాకుండా నిఘా ఉంటుంది. గది బయట మొదటి అంచెలో ఒక ప్లాటూన్ కేంద్ర బలగాలు రక్షణగా ఉంటాయి. ఒక ప్లాటూన్‌లో 30 నుంచి 50 మంది సైనికులు ఉంటారు. వీరి విధులకు సంబంధించి లాగ్‌ బుక్ నిర్వహించాలి. ఆ తర్వాత రెండు అంచెల్లో రాష్ట్ర పోలీసులు పహారా కాస్తుంటారు. భద్రతా సిబ్బంది మూడు షిఫ్టుల్లోనూ విధులు నిర్వహిస్తారు.

CCTV నిఘా….

స్ట్రాంగ్‌రూం లోపల, బయటా CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలి. స్ట్రాంగ్‌ రూం పక్కనే 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ఉండాలి. అంతేకాదు స్ట్రాంగ్‌ రూమ్‌ ఎంట్రెన్స్ దారిని ఎప్పుడూ CCTV కెమెరాల నిఘాలో ఉంటుంది. స్ట్రాంగ్‌ రూంకి ఒకటి కంటే ఎక్కువ ప్రవేశ మార్గాలు ఉంటే వాటిని కూడా వీడియో తీస్తూ ఉండాలి. స్ట్రాంగ్‌రూం భద్రతా ఏర్పాట్లను 24 గంటలూ పరిశీలించేందుకు ఒక సీనియర్ అధికారితో పాటు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలి. అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగితే వెంటనే ఆర్పివేసేలా స్ట్రాంగ్‌రూం లోపల, బయట తగినన్ని అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేయాలి.

వచ్చే ప్రతీ ఒక్కరి పూర్తి వివరాలు….

స్ట్రాంగ్ రూం పరిశీలనకు రోజూ అధికారులు వస్తుంటారు. అధికారులు మినహా మరెవరినీ అక్కడికి అనుమతించరు. స్ట్రాంగ్‌ రూంలకు వెళ్లే దారి మొత్తం నిఘా నీడలో ఉంటుంది. స్ట్రాంగ్ రూం రెండో అంచె భద్రతా వలయాన్ని దాటే ప్రతీ వ్యక్తి వివరాలు తప్పని సరిగా నమోదు చేయాలి. జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఎస్పీ, అభ్యర్థులతో పాటు పోలింగ్ ఏజెంట్లందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. రిటర్నింగ్ అధికారి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్ట్రాంగ్‌రూం ఏరియాను సందర్శించి.. లాగ్‌ బుక్‌ను, సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించాలి. ఒకవేళ స్ట్రాంగ్‌రూంలు జిల్లా కేంద్రంలో ఉంటే జిల్లా ఎన్నికల అధికారి ఆ బాధ్యత తీసుకోవాలి. ఏ రోజు ఎవరు వచ్చి తనిఖీ చేశారన్నది లాగ్‌ బుక్‌లో నమోదు చేయాలి. EVM లు స్ట్రాంగ్‌ రూంలో ఉన్నంత కాలం అక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసుకోవాలి. స్టాండ్‌బై గా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి. పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు ఇవ్వాలి. అభ్యర్థులు ఆ నెంబర్లను స్ట్రాంగ్ రూంల దగ్గర ఉన్న తమ ఏజెంట్లకు అందించాలి.

ఎవరి వాహనాలకు అనుమతి లేదు...

మంత్రులు, అభ్యర్థులు, అధికారుల వాహనాలను మూడో అంచెలోకి రాకముందే నిలిపివేయాలి. ఆ తర్వాత ఎవరైనా సరే అక్కడి నుంచి నడుచుకుంటూనే స్ట్రాంగ్‌ రూం వరకు వెళ్లాల్సి ఉంటుంది. వాహనాల పార్కింగ్ మార్కింగ్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ఓట్ల లెక్కింపు రోజున స్ట్రాంగ్‌ రూంని అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడి సమక్షంలో వీడియో తీస్తుండా తెరవాలి. స్ట్రాంగ్ రూం నుంచి కంట్రోల్ యూనిట్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించడాన్ని వీడియో తీయాలి. అభ్యర్థుల ఏజెంట్లు CCTV ద్వారా స్ట్రాంగ్‌రూంని గమనించేందుకు అనుమతించాలి. ఓట్ల లెక్కింపు తర్వాత కంట్రోల్ యూనిట్లకు సీల్ వేయాలి. ఈ ప్రక్రియ తర్వాత EVMలను తిరిగి స్ట్రాంగ్‌రూంకి తరలించాలి.