లెటర్​ టు ఎడిటర్: గెలిస్తే వస్తా.. ఓడితే రాను

లెటర్​ టు ఎడిటర్: గెలిస్తే వస్తా.. ఓడితే రాను

ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న ప్రతిపక్షనాయకుడు, గత ముఖ్యమంత్రి వ్యవహారశైలి చాలా విచిత్రంగా ఉంటున్నది. తెలంగాణ ఏర్పడక ముందు అతడు ఏవిధంగా మాట్లాడినా ప్రజలకు మంచిగానే అనిపించింది. రాష్ట్రం ఏర్పడ్డాక అతని వ్యవహారశైలి బాగోలేదు. తొలి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అతని వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి తానే ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నాడు. అయినా ప్రజలు వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఉద్యమనాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించారు.

మొదటి మంత్రివర్గంలో  ఒక్క మహిళా మంత్రి లేరు. రెండోసారి 3 నెలల వరకు మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు. నేనే రాజును, నేనే మంత్రిని అని పరిపాలన సాగించాడు. ప్రతిపక్షాలను గౌరవించిన పాపానపోలేదు. ప్రతిపక్షాలను తుడిచేసే ప్రయత్నం చేశాడు. ఇతరులను తన భాషలో అవహేళన చేసేవాడు. తనకు ఏది మనసుకు వస్తే అదే చేసేవాడు. కొంత కాలానికి తన అబద్ధాన్ని తానే సమర్థించుకునేవాడు. కుటుంబపాలన సాగించాడు. రాజరికపు పోకడలు చూపారు. 1200 మంది అమరుల త్యాగాలను వారి పేర్లను కూడా ఉచ్చరించకుండా తనే తెలంగాణను తెచ్చినట్లుగా చెప్పుకునేవాడు.

తెలంగాణకు దేశ ప్రధాని వచ్చినా మర్యాద పూర్వకంగా కలిసేవాడు కాదు. గవర్నర్​నూ కలిసేవాడు కాదు. ప్రజలు వారి పాలనను గ్రహించి ప్రతిపక్షంలో కూర్చోబెడితే.. జీర్ణించుకోలేక అసెంబ్లీకి రాకుండా ఎగనామం పెడుతున్నారు. అది ప్రజాస్వామ్య దేశంలో మంచిది కాదు. గెలిస్తే వస్తా.. లేకపోతే రాను అని ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద అలిగినట్లు ఉన్నాడు. అదీ ఆయన వ్యవహారశైలి. ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఆయన రాజకీయ వ్యవహారాలు అవుటాఫ్​ బాక్స్​గా ఉంటున్నాయి. ఆయన వ్యవహారశైలి తెలంగాణ రాజకీయ వ్యవస్థకు మంచి పరిణామం కాదు.

- అల్లం మల్లికార్జున్​రావు, ప్రధానోపాధ్యాయుడు (రిటైర్డ్​)