
హైదరాబాద్: రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి. మురళీధర్ రావు, ఆయన బంధువుల నివాసాల్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అధిక మొత్తంలో అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు జరిపారు.
ఈ సోదాల్లో మురళీధర్ రావు కుటుంబానికి చెందిన అనేక స్థిరాస్తులు, విలువైన వస్తువులు బయటపడ్డాయి. అందులో ఒక విల్లా కొండాపూర్‌లో, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, బేగంపేట, కోకాపేట్లో ఫ్లాట్లు ఉన్నాయి. కరీంనగర్, హైదరాబాద్‌లలో కమర్షియల్ బిల్డింగులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.
కోదాడలో ఒక అపార్ట్‌మెంట్, జహీరాబాద్‌లో సోలార్ ప్రాజెక్ట్, వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న మరో అపార్ట్‌మెంట్ ఉన్నట్టు బయటపడింది. దీనితో పాటు 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 4 రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు, మోకిలాలో 6500 చదరపు గజాల భూమి ఉన్నట్టు తెలిసింది.
3 నాలుగు చక్రాల వాహనాలు, అందులో మెర్సిడెస్ బెంజ్ కారు ఒకటి, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు కూడా సోదాల్లో బయటపడ్డాయి. ఇవన్నీ అధికారిక హోదా ఉపయోగించి దుర్వినియోగం ద్వారా సంపాదించిన ఆస్తులుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మురళీధర్ రావును ఏసీబీ అరెస్ట్ చేసింది. మరిన్ని వివరాల కోసం విచారణ కొనసాగుతోంది.