
గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ 1 ఏరియాలో జీడీకే 5 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ కోసం సుందిళ్ల గ్రామంలోని రైతుల వద్ద మైనింగ్ కోసం తీసుకున్న లీజు భూమికి రూ.1.04 కోట్ల ఎక్స్గ్రేషియా చెక్కులను మేనేజ్‌మెంట్ అందజేసింది. గురువారం ఏరియా జీఎం ఆఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో జీఎం డి.లలిత్ కుమార్ 16.04 ఎకరాల భూమికి (ఎకరానికి రూ.6.50 లక్షల చొప్పున) సంబంధించి ఏడుగురు రైతులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఎక్స్గ్రేషియా చెల్లింపు ఆపలేదని, కంపెనీకి అందిన అప్లికేషన్లను పరిశీలించి అర్హులకు ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని సుందిళ్ల గ్రామస్తులు గమనించాలని కోరారు. కార్యక్రమంలో ఆఫీసర్లు ఆంజనేయ ప్రసాద్, డి.రమేశ్, జీఎల్ రాజు, ధనలక్ష్మిబాయి, సాంబశివరావు, ఆఫ్రిన్ సుల్తానా పాల్గొన్నారు.