అమిత్ షా టూర్‌‌‌‌ సందర్భంగా బీజేపీలోకి మాజీ మంత్రి?

అమిత్ షా టూర్‌‌‌‌ సందర్భంగా బీజేపీలోకి మాజీ మంత్రి?
  • చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భారీ సభ
  • అమిత్ షా టూర్‌‌‌‌ సందర్భంగా బీజేపీలోకి మాజీ మంత్రి?
  • ఇప్పటికే పార్టీ లీడర్లతో పూర్తయిన చర్చలు!
  • 23న రాష్ట్రానికి అమిత్ షా

హైదరాబాద్, వెలుగు:  కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ ఖరారైంది. ఈ నెల 23న ఆయన రాష్ట్రానికి రానున్నారు. కర్నాటకలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చే ఆదివారం అమిత్ షా వెళ్తున్నారు. మార్గమధ్యలో శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టులో దిగి.. దగ్గర్లోని చేవెళ్ల లేదా వికారాబాద్‌‌‌‌లో రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేయనున్న సభలో పాల్గొననున్నారు. మోడీ టూర్ ముగిసిన 15 రోజుల వ్యవధిలోనే అమిత్ షా రానుండటంతో రాష్ట్ర నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభ ఏర్పాట్ల సక్సెస్‌‌పై చర్చించేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీజేపీ నేతలు సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డితో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లాల బీజేపీ అధ్యక్షులు పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, తాండూర్, వికారాబాద్, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించడంపై చర్చించారు. అమిత్ షా టూర్ షెడ్యూల్‌‌ను మంగళవారం అధికారికంగా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించే అవకాశం ఉంది.

త్వరలో బీఆర్ఎస్‌‌కు మాజీ మంత్రి గుడ్ బై

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్‌‌కు చెందిన మాజీ మంత్రి త్వరలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్నది. తన సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేతో సదరు మాజీ మంత్రికి అస్సలు పొసగడం లేదు. తాను మొదటి నుంచీ ఉన్న పార్టీలోకి వలస వచ్చిన ఎమ్మెల్యే నుంచి అడగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి ఆయన పలు మార్లు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకుండాపోవడంతో సదరు మాజీ మంత్రి ఇక బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల బీజేపీకి చెందిన ఓ నేతతో చర్చలు జరిపారని, పార్టీలో చేరేందుకు  సిద్ధంగా ఉన్నానని ఆయన సంకేతాలు ఇచ్చారని జోరుగా ప్రచారం సాగుతున్నది. అమిత్ షా టూర్ ఈయన అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరగనుంది. దీంతో అమిత్ షా వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కలిసి, పార్టీలో చేరికపై ప్రకటన చేసే అవకాశం ఉందా అనే చర్చ సాగుతున్నది. ఒకవేళ అమిత్ షా టూర్‌‌‌‌ సందర్భంగా బీజేపీలో చేరికపై ప్రకటన రాకున్నా.. మంచి ముహుర్తం చూసుకొని చేరిపోవడం పక్కా అనే ప్రచారం జరుగుతున్నది.

నేడు రాష్ట్రానికి సునీల్ బన్సల్, శివ ప్రకాశ్

రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత బలోపేతంపై ముఖ్య నేతలతో చర్చించేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్‌‌ సునీల్ బన్సల్, పార్టీ సంస్థాగత జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ శివ ప్రకాశ్ మంగళవారం హైదరాబాద్ రానున్నారు. ఈ ఇద్దరు నేతలు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. పార్టీ స్టేట్ ఆఫీసులో అందుబాటులో ఉన్న నేతలతో పాటు జిల్లాల అధ్యక్షులు, ఇన్‌‌చార్జ్‌‌లతో సమావేశమై చర్చించనున్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తున్నారు? బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్తున్న తీరు.. పార్టీ సశక్తికరణ్ ప్రోగ్రామ్ అమలుపై చర్చించనున్నారు. అమిత్ షా టూర్, ఆయన పాల్గొననున్న సభ సక్సెస్‌‌పై కూడా పార్టీ నేతలకు సునీల్ బన్సల్, శివప్రకాశ్ దిశా నిర్దేశం చేయనున్నారు.