మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కన్నుమూత

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కన్నుమూత

హైదరాబాద్​: మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త, తెలంగాణ పోరాట యోధుడు జువ్వాడి రత్నాకర్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగిన రత్నాకర్ రావు విలువలు కలిగిన రాజకీయవేత్తగా ప్రజాదరణ పొందారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ లో 1928 అక్టోబర్ 4 న జన్మించిన ఆయన తెలంగాణ సాయుధ పోరాట సమయంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి కొంతకాలం జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత 12 ఏళ్ల పాటు సర్పంచ్ గా పనిచేశారు. జగిత్యాల పంచాయతీ ప్రెసిడెంట్ గా ధర్మపురి ఆలయ కమిటీ మొదటి పాలక మండలి చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఏపీలో బుగ్గారం నియోజకవర్గం నుంచి ఒక సారి ఇండిపెండెంట్ గా, రెండు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

జువ్వాడి మృతి పట్ల మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి సంతాపం ప్రకటించారు. ఆయన మంచి రాజకీయ విలువలు ఉన్న వ్యక్తి అని అన్నారు. జువ్వాడి రత్నాకర్ రావు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పీసీసీ చీఫ్​ ఉత్తమ్ కుమార్ అన్నారు.