ఉద్యమకారుల గొంతు కోసి.. పదవులన్నీ కుటుంబ సభ్యులకే

ఉద్యమకారుల గొంతు కోసి.. పదవులన్నీ కుటుంబ సభ్యులకే
  • ఈటల విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి రాజీనామా చేసారు 
  • ప్రజలు తనతో ఉన్నారనే నమ్మకంతో ఈటల రాజీనామా చేశారు
  • మాజీ ఎంపీ, బీజేపీ కొర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి

న్యూఢిల్లీ: తెలంగాణ కోసం ప్రణాలు పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారుల గొంతు కోసి.. పదవులన్నీ కుటుంబ సభ్యులకే ఇచ్చుకుంటున్నారని మాజీ ఎంపీ, బీజేపీ కొర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఈటల రాజేందర్ విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి రాజీనామా చేశారని, ప్రజలు తనతో ఉన్నారనే నమ్మకంతో ఈటల రాజీనామా చేశారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సందర్బంగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. రాజీనామాపై ఈటల దైర్యంగా నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఈటల బీజేపీలో చేరుతుండటం శుభపరిణామం అని ఆయన చేరికతో బీజేపీ మరింత బలపడుతుందన్నారు. ఈటల విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి రాజీనామా చేశారని ప్రస్తావిస్తూ సీఎం కెసిఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మందిని రాజీనామా చేయించకుండా టీఆరెస్ లో చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు నైతిక విలువలుంటే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. 
అభివృద్ధి చూసే చేరారని అంటున్న కేసిఆర్ అక్కడ టీఆరెస్ అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారో చెప్పాలన్నారు. టీఆరెస్ లో ఉన్నవాళ్ళందరూ అసంతృపిగా ఉన్నవాళ్లేనని,  బానిసలుగా అక్కడ ఉంటున్నారని చెప్పారు.టీఆర్ఎస్ నుండి చేరికలు ఇప్పుడే ప్రారంభమైయ్యాయని, రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ పాలన, నియంతృత్వ పాలనపై వేసారిన నేతల చేరికలు త్వరలోనే ఉంటాయన్నారు. ఈటలతో ఢిల్లీ రావాలని చాల మంది ఆసక్తిగా ఉన్నారు, దాదాపుగా 200 మంది ఢిల్లీ వస్తున్నారని, కెసిఆర్ తెలంగాణ ఉద్యమకారుల గొంతుకోసి అన్ని పదవుల్లో తన కుటుంబ సభ్యులను పెడుతున్నాడని ఆరోపించారు. నియంతృత్వ పాలనపై ప్రజా పోరాటం ప్రారంభమైందని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల ను తప్పుడు ఆరోపణలు చేసి బయటకు పంపారని విమర్శించారు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యే లపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోకుండా కేవలం ఈటల పైనే ఎందుకు చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు.