ఫెయిలైన కేటీఆర్‌కు ప్రమోషనా! : వివేక్ వెంకట స్వామి

ఫెయిలైన కేటీఆర్‌కు ప్రమోషనా! : వివేక్ వెంకట స్వామి
  • కప్పులు మోసెటోళ్లకు పదవులు: వివేక్‌ వెంకటస్వామి

ఐదు నెలల కింద వర్కింగ్ ప్రెసిడెంట్‌ను చేస్తే ఏడు ఎంపీ స్థానాలు కోల్పోయి ఫెయిల్ అయినందుకే సీఎం కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌కు ప్రమోషన్‌గా మళ్లీ మంత్రి పదవి ఇచ్చారని మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి విమర్శించారు. తెలంగాణ ప్రజల పోరాట చరిత్రను తొక్కి పెట్టి కల్వకుంట్ల వారి చరిత్రను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మన్‌ అన్నారు. మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించారు. ఇందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్‌‌ మాట్లాడుతూ టీఆర్‌‌ఎస్‌ లో ముసలం పుట్టిందని అన్నారు. ఆ పార్టీకి ఓనర్లు ఎంతమందో తెలియడంలేదని.. నేడు ఒక్కొక్కరుగా గొంతు విప్పుతున్నారన్నారు. రాష్ట్రం గతంలో మిగులు బడ్జెట్‌తో ‌ఉంటే కేసీఆర్‌ ‌కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. గతేడాది కంటే బడ్జెట్‌‌36వేల కోట్లు ఎందుకు తగ్గిందో సీఎం ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. వివేక్‌‌వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితం అయ్యాడన్నారు. తెలంగాణ ఉద్యమకారులను పక్కన బెట్టి ప్రగతి భవన్ లో కప్పులు సాసర్లు మోసే వారికి పదవులు ఇచ్చాడన్నారు. ఇన్నాళ్లు హరీశ్‌రావును పక్కన పెట్టి రాజకీయంగా గొంతుకోసి… ఇప్పుడు దివాళ తీసిన ఆర్థిక శాఖకు మంత్రిని చేశారన్నారు. బీజేపీ రాష్ట్ర గవర్నర్‌‌ గా మహిళను నియమించడంతో కేసిఆర్ భయపడి మహిళకు మంత్రిగా అవకాశం ఇచ్చాడన్నారు. అలాగే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి తృణప్రాయంగా అర్పించిన మహబూబాబాద్‌ జిల్లా పెరుమాండ్ల సంకీస గ్రామంలోని 21 మంది అమరుల కుటుంబాలను సన్మానించారు. అన్ని విధాలుగా బీజేపీ అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. వీరి వెంట పార్టీ నాయకులు పెద్దిరెడ్డి, రవీంద్ర నాయక్‌‌, విజయరామారావు, కొండేటిశ్రీధర్‌‌, ధర్మారావు, సంకినేని వెంకటేశ్వర్‌‌రావు, రామచందర్‌‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఆలయంలో నీ శిల్పమా… బుద్ధుందా?

‘దేవుడి సన్నిధిలో బొమ్మ చెక్కించుకుంటావా… కేసీఆర్ నీకు బుద్ధుందా? అంటూ మాజీ ఎంపీ, బీజేపీ నేత జి.వివేక్ వెంకటస్వామి సీఎంపై మండిపడ్డారు. సోమవారం ఆయన యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం సీఎం కేసీఆర్ ఫొటో, కారు గుర్తు చెక్కిన స్తంభాలను పరిశీలించారు. పవిత్రమైన ఆలయంలో కూడా సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పేరుతో కేసీఆర్ అందరినీ వాడుకున్నారని, రాష్ట్రం ఏర్పడ్డాక.. నియంతలా మారారని ఆరోపించారు. ‘సీఎం కేసీఆర్ పేరుకోసం పాకులాడుతున్నారు. పాత కట్టడాల పేరుతో ఉన్న భవనాలను కూల్చేస్తూ, కొత్త కట్టడాలపై పేరు చెక్కించుకుంటున్నారు. ఈ పిచ్చితోనే యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి సన్నిధిలో తన బొమ్మ చెక్కమని ఆదేశించారు’ అని వివేక్ ఆరోపించారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ నేతృత్వంలో ఆందోళనలు నిర్వహించడం, ప్రజల్లో వ్యతిరేకత రావడంతో కేసీఆర్ దిగొచ్చారని అన్నారు. సీఎం ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియెట్​ కూల్చివేతను అడ్డుకొని తీరుతామని చెప్పారు.