మేయర్ షెడ్యూల్‌‌ తర్వాతే.. ఎక్స్ అఫీషియో ఓటు నమోదు

మేయర్ షెడ్యూల్‌‌ తర్వాతే.. ఎక్స్ అఫీషియో ఓటు నమోదు
  • ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ జారీ చేయనున్న జీహెచ్‌ఎంసీ
  • ఇప్పటికే మున్సిపాలిటీల్లో చాలా మంది ఎక్స్ అఫీషియో ఓట్లను వాడుకున్న టీఆర్ఎస్​‘

హైదరాబాద్, వెలుగు: మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం షెడ్యూలు  విడుదల చేశాకే ఎక్స్ అఫీషియో మెంబర్లు ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా నోటిఫికేషన్  జారీ చేయనుంది. ప్రస్తుత జీహెచ్​ఎంసీ పాలక మండలి గడువులోపు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించుకునే అవకాశం ఉంది. ఏదైనా పార్టీ సొంతగా మేయర్ సీటు దక్కించుకోవాలంటే 150 మంది కార్పొరేటర్లలో 76 మంది కార్పొరేటర్లను గెలుచుకోవాలి. ఒకవేళ అంత సంఖ్యలో కార్పొరేటర్లు గెలువకపోతే ఎక్స్ అఫీషియో ఓటర్లతో మేయర్​ సీటును దక్కించుకోవచ్చు. మేజిక్​ ఫిగర్​ రాకపోతే ఎక్స్​ అఫీషియోలను రంగంలోకి దింపాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ కు 28 మంది ఎక్స్ అఫీషియో ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. వీరిలో 14 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు, నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. నిజామాబాద్ లోకల్ బాడీ కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ ఎంపీ కవిత గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు తన ఓటును ఇక్కడికి బదిలీ చేయించుకున్నారు. మజ్లిస్ పార్టీకి 10 మంది ఎక్స్​ అఫీషియోలున్నారు. వీరిలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ. బీజేపీకి ముగ్గురు ఎక్స్​ అఫీషియోలు ఉన్నారు. వీరిలో ఒకరు ఎంపీ, ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎమ్మెల్సీ. కాంగ్రెస్​కు ఒక్క ఎక్స్​ అఫీషియో ఓటు ఉంది. వీరంతా కొత్తగా ఎక్స్​ అఫీషియో ఓటు కోసం నమోదు చేసుకోవాలి.

మున్సిపాలిటీల్లోనూ ఎక్స్ అఫీషియో ఓట్లు..

ఈ ఏడాది జనవరిలో జరిగిన మున్సిపాల్టీ ఎన్నికల్లో చైర్మన్  పదవి కోసం టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఎక్స్ అఫీషియో ఓట్లను వినియోగించుకుంది. వీరంతా గతంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్స్ అఫీషియో ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.  అప్పుడు జీహెచ్​ఎంసీలో ఓటు వేయకపోవడంతో వేరే ప్రాంతాలకు బదిలీ చేయించుకున్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్ రెడ్డి, ఎగ్గే మల్లేశం ఓటు వేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో ఎమ్మెల్సీలు గంగాధర్, రాజేశ్వరరావు, ఆకుల లలిత ఎక్స్ అఫీషియో ఓట్లు వేశారు. మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ మున్సిపాలిటీలో ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్ , ఫారూక్ హుస్సేన్ ఓటు వేశారు. నల్గొండలో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, కోస్గీలో ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, కొంపల్లిలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానందగౌడ్  ఓటు వేశారు. నార్సింగ్ లో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, పెద్ద అంబర్ పేటలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఆదిభట్లలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ ప్రకాశ్ ఓటేశారు. వీళ్లు ఇప్పుడు జీహెచ్​ఎంసీలో ఓటేసేందుకు సాధ్యపడదు.