టెన్త్ స్టూడెంట్లకు ఎగ్జామ్ టెన్షన్!

టెన్త్ స్టూడెంట్లకు ఎగ్జామ్ టెన్షన్!

ఆన్ లైన్ క్లాసులతో ఆగమాగం
మిగిలింది రెండే నెలలు
కరోనాతో స్పెషల్ క్లాసులు, స్టడీ అవర్స్ లేవ్ 
ఇంపార్టెంట్ చాప్టర్స్ చెబుతూ, రోజూ టెస్టులు పెడుతున్రు

హైదరాబాద్, వెలుగుటెన్త్ స్టూడెంట్లకు పరీక్షల భయం పట్టుకుంది. కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్లు మూతపడటంతో ఇన్నాళ్లూ స్టూడెంట్లు ఆన్ లైన్ క్లాసులతో చాలా అవస్థలు పడ్డరు. ఇప్పుడు మరో రెండు నెలలే టైం మిగిలి ఉండటంతో అర్థం కాని సబ్జెక్ట్ లతో ఎగ్జాంలు ఎట్లా రాయాల్నో అంటూ టెన్షన్ పడుతున్నరు. టెన్త్ స్టూడెంట్లను ఎట్లన్నా గట్టెక్కించాలని టీచర్లు కూడా జోరుగా చదివిపిస్తున్నరు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలోనూ ఇప్పుడు ఇదే సీన్ కన్పిస్తున్నది. స్కూళ్లు రీఓపెన్ అయిన తర్వాత టీచర్లు మళ్లీ మొదటి నుంచి లెసన్స్ చెబుతూ, ఎప్పటికప్పుడు చాప్టర్ వైజ్ గా స్లిప్ టెస్ట్ లు పెడుతున్నారు. ఈసారి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారడం, చాయిస్ బేస్డ్, ఆప్షన్స్ ఎక్కువగా ఉండటంతో అందుకు అనుగుణంగా స్టూడెంట్లని గైడ్ చేస్తున్నారు టీచర్లు. అయితే కరోనా కారణంగా ఈసారి స్టడీ అవర్స్, స్పెషల్ క్లాసులు కూడా నిర్వహించలేదు. అందుకే ఉదయం ఓ గంట, సాయంత్రం ఓ గంట పాటు ప్రత్యేకంగా రివిజన్ కోసం కేటాయించాలని స్కూళ్ల మేనేజ్ మెంట్లే
ఆలోచిస్తున్నాయి.

మళ్లీ మొదటి నుంచి..

టెన్త్ సిలబస్ మొత్తం డిజిటల్ క్లాసులతో అయిపోయింది. ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లలోని స్టూడెంట్లు ఆన్ లైన్ క్లాసుల కారణంగా లెసన్స్ అర్థంకాక, సబ్జెక్ట్ నాలెజ్డ్ ఇంప్రూవ్ అవ్వక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సర్కారు బడుల్లో చదువుతున్న పిల్లలకు స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, ఫోన్లు ఉన్నా నెట్ వర్క్ సమస్యల వల్ల లెసన్స్ వినలేకపోయారు. ప్రయివేట్ స్కూళ్ల స్టూడెంట్లు డిజిటల్ క్లాసులకు రెగ్యులర్ గా అటెండ్ అయినా సబ్జెక్ట్ లలో అనేక డౌట్స్ ఉన్నాయని అంటున్నారు. దీన్నిబట్టి ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లలో చదివే స్టూడెంట్లు అందరూ ఆన్ లైన్ క్లాసుల వల్ల పెద్దగా నేర్చుకోలేదు. దీంతో స్కూల్స్ రీఓపెన్ అయ్యాక టీచర్లు మళ్లీ మొదటి నుంచి పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇంపార్టెంట్ చాప్టర్ లనే చెప్తూ, వాటిపైనే డైలీ టెస్ట్ లు కండక్ట్  చేస్తున్నారు. పిల్లలు ప్రెజర్ కి లోనవకుండా వారిని మోటివేట్ చేస్తూ ఫైనల్ ఎగ్జామ్స్ కి సిద్ధం చేస్తున్నారు. డైరెక్ట్ క్లాసుల వల్లే లెసన్స్ అర్థం అవుతున్నాయని, ఏ డౌట్ ఉన్నా టీచర్ ని అడిగి క్లారిఫై చేసుకుంటున్నామని స్టూడెంట్లు చెప్తున్నారు.

పేరెంట్స్ లోనూ బుగులు

కరోనా కారణంగా ఈసారి స్కూళ్లు మూతపడటంతో ఫైనల్ ఎగ్జాంలకు టైం తక్కువగా ఉంది. దీంతో తమకంటే ముందు బ్యాచ్ స్టూడెంట్లు ఏడాది మొత్తం చదివిన పాఠాలను, తాము మూడునెలల్లో కంప్లీట్ చేసి ఎగ్జాంలు రాయడం పెద్ద టాస్కే అని స్టూడంట్లు అంటున్నారు. హయ్యర్ స్టడీస్ కి పదో తరగతి బేస్ కావడం, డిజిటల్ క్లాసుల వల్ల సబ్జెక్టుల మీద సరైన పట్టు లేకపోవడంతో టెన్షన్ పడుతున్నారు. మరోవైపు పేరెంట్స్ కూడా ఈసారి యాన్యువల్ ఎగ్జాంలు ఎలా ఉంటాయో? తమ పిల్లలు ఎలా రాస్తారో? అని బుగులు పడుతున్నారు.

భయంగా ఉంది

పరీక్షలంటే భయంగా ఉంది. స్కూల్ స్టార్ట్ అయ్యాక డైరెక్ట్ క్లాసుల వల్ల ఎక్కువగా నేర్చుకుంటున్నాం. టీచర్లతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతున్నాం. మ్యాథ్స్ టఫ్ సబ్జెక్టు. మా అక్క, టీచర్ల నుంచి టిప్స్ తీసుకుని ప్రిపేర్ అవుతున్నా. ఫ్రెండ్స్ తో కలిసి చదువుకుంటున్నా.

‑ రత్నం, టెన్త్ స్టూడెంట్, గవర్నమెంట్ హైస్కూల్, ఫిలింనగర్, హైదరాబాద్

ప్రెజర్ పోయేలా టిప్స్

ఆన్ లైన్ క్లాసులతో పిల్లలు లెసన్స్ అర్థం కాక ఇబ్బంది పడ్డారు. స్టూడెంట్లకు సైన్స్, మ్యాథ్స్ టఫ్ సబ్జెక్టులు. ఆన్ లైన్ క్లాసుల వల్ల వీటిలో ఇంకా వెనుకపడ్డారు. అందుకే క్లాస్ తీసుకున్నాక ఇంపార్టెంట్ లెక్కలను మాత్రమే వారి చేత ప్రాక్టీస్ చేయిస్తున్నాం. ఒత్తిడికి గురవ్వకుండా టిప్స్ కూడా ఇస్తున్నాం.                                                                         ‑ మాధురి, టీచర్, గవర్నమెంట్ హైస్కూల్, ఫిలింనగర్, హైదరాబాద్