
నితేష్ తివారీ ( Nitesh Tiwari )దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణం'( Ramayana ) భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్( Prime Focus Studios ) నిర్మిస్తుంది. ఈ మూవీ తొలి గ్లింప్స్ విడుదలైన ( జూలై 3న ) వెంటనే అంచనాలకు మించి సంచలనం సృష్టించింది . భారతీయ సినీ చరిత్రలో ఇంతవరకు రూపొందని అతిపెద్ద చిత్రంగా ప్రచారం చేయబడుతున్న ఈ సినిమా, విడుదల కాకముందే భారీ అంచనాలను పెంచడమే కాకుండా, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ షేర్ మార్కెట్ పనితీరుపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. కేవలం 48 గంటల్లోనే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,000 కోట్లు పెరగడం సినీ, ఆర్థిక రంగాలను ఆశ్చర్యపరిచింది.
అమాంతం పెరిగిన కంపెనీ మార్కెట్ విలువ
అయితే, అసలు సంచలనం 'రామాయణం' ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన తర్వాత మొదలైంది. ఇది కేవలం సినీ అభిమానులనే కాదు, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ పెట్టుబడిదారులను కూడా ఉర్రూతలూగించింది. ఫలితంగా, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయిన ప్రైమ్ ఫోకస్ షేర్లు అద్భుతమైన పనితీరును కనబరిచాయి. జూన్ 25న రూ.113.47గా ఉన్న షేరు ధర, జూలై 1 నాటికి 30 శాతం పెరిగి రూ.149.69కి చేరుకుంది. జూలై 3న (గ్లింప్స్ విడుదలైన రోజు) ప్రైమ్ ఫోకస్ షేర్లు గరిష్టంగా రూ.176కు చేరుకున్నాయి. ఇది కేవలం 48 గంటల్లోనే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను జూలై 1న ఉన్న రూ.4,638 కోట్ల నుంచి రూ.5,641 కోట్లకు పెంచింది. అంటే, కేవలం రెండు రోజుల్లోనే రూ1,000 కోట్లకు పైగా మార్కెట్ విలువ పెరగడం సినీ , ఆర్థిక వర్గాలను విస్మయపరిచింది. మార్కెట్ ముగిసే సమయానికి షేరు ధర రూ.169 వద్ద స్థిరపడగా, మార్కెట్ క్యాప్ రూ.5,200 కోట్లకు చేరుకుంది. ఇది భారతీయ సినీ వర్గాల్లో, ఆర్థిక రంగాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రణబీర్ కపూర్ - నటుడిగానే కాదు, పెట్టుబడిదారుడిగా!
'రామాయణం'లో రాముడి పాత్రను పోషిస్తున్న రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) కూడా ఈ సినిమా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్‌లో పెట్టుబడిదారుడిగా కూడా మారడం మరో ఆసక్తికరమైన విషయం. కొత్త షేర్ల జారీకి బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత, ప్రతిపాదిత లబ్ధిదారుల జాబితాలో రణబీర్ పేరు చేర్చబడింది. ఆయన ప్రైమ్ ఫోకస్‌లో 1.25 మిలియన్ షేర్లను కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం, ఈ పెట్టుబడి సుమారు రూ.20 కోట్లు ఉంటుందని అంచనా, అయితే ఖచ్చితమైన కొనుగోలు ధరను మాత్రం ఇంకా వెల్లడికాలేదు. ప్రైమ్ ఫోకస్ లో రణబీర్ కపూర్ ఈ షేర్లు విలువ కూడా భారీగానే పెరిగిందని సమాచారం.
►ALSO READ | Rajinikanth Coolie : లోకేష్ 'కూలీ'లో రజినీకాంత్ Vs నాగార్జున: ఆమిర్ ఖాన్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్!
భారీ తారాగణం.. పెంచుతున్న అంచనాలు.
నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ 'రామాయణం' రెండు భాగాలుగా తెరకెక్కనుంది. పార్ట్ 1 దీపావళి 2026లో విడుదల కానుండగా, పార్ట్ 2 2027లో విడుదల కానుంది. భారీ తారాగణంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) , రావణుడుగా యష్ ( Yash ) , సీతగా సాయి పల్లవి ( Sai Pallavi ) , లక్ష్మణుడుగా రవి దూబే ( Ravi Dubey ), హనుమాన్ గా సన్నీ డియోల్ ( Sunny Deol ) వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో వైపు ఈ చిత్రానికి సంగీతం కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ ( AR Rahman ), హాన్స్ జిమ్మర్ (Hans Zimmer ) కలిసి పనిచేయడం భారతీయ సినీ చరిత్రలోనే ఇది మొదటిసారి. హాన్స్ జిమ్మర్ బాలీవుడ్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడంతో, సంగీత ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'రామాయణం' కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, భారతీయ సినీ పరిశ్రమలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని, భవిష్యత్ చిత్ర నిర్మాణాలకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.