కరోనాతో పెండ్లాం, పిల్లలు పోయారని చెప్పి.. 50 ఏళ్ల ఈమెను పెండ్లాడి.. కెరీర్ మీద ఇలా ఫోకస్ పెట్టావా ?

కరోనాతో పెండ్లాం, పిల్లలు పోయారని చెప్పి.. 50 ఏళ్ల ఈమెను పెండ్లాడి.. కెరీర్ మీద ఇలా ఫోకస్ పెట్టావా ?

చిత్తూరు: ఆ మహిళ వయసు 50 సంవత్సరాలు. పాతికేళ్ల క్రితం ఆమెకు పెళ్లైంది. పదిహేనేళ్ల క్రితం ఆమె కొడుకు దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కొడుకు లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేక పదేళ్ల క్రితం మానసిక క్షోభతో ఆ మహిళ భర్త కూడా చనిపోయాడు. పెళ్లై భర్త పిల్లలతో సంతోషంగా గడపాల్సిన ఆమెను విధి ఒంటరి చేసింది. ఆ ఒంటరితనం నుంచి, ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడటానికి ఆమెకు కొన్నేళ్ల సమయం పట్టింది. అయినప్పటికీ ఆమెను ఒంటరితనం వదిలిపోలేదు.

సన్నిహితుల సలహా మేరకు ఆ ఒంటరితనం నుంచి బయటపడేందుకు ఆమె కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వేలెత్తి చూపడానికి సిద్ధంగా ఉండే సమాజాన్ని పట్టించుకోకుండా తన జీవితానికి ఆమె ఒక తోడు కోరుకుంది. అనుకున్నట్టుగానే ఆమెకు ఒక తోడు దొరికాడు. కానీ అతను ఆమెను ఆదరిస్తాడనుకంటే ఆమె ఆస్తిపై కన్నేశాడు. కాజేసి మోసం చేయడంతో తనను మోసం చేశాడని, న్యాయం చేయాలని చిత్తూరు గ్రీవెన్స్ సెల్ను బాధితురాలు ఆశ్రయించింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా, రామకుప్పం మండలం, రాజుపేటకు చెందిన నాగమణికి (50) చిత్తూరుకు చెందిన పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా బంగారుపాలెం మండలం శేషాపురంకు చెందిన శివప్రసాద్తో పరిచయం ఏర్పడింది. పరిచయం చేసుకున్న శివప్రసాద్ తన భార్యాబిడ్డ కరోనా సమయంలో చనిపోయారని ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి నాగమణిని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. నాగమణి దగ్గర ఉన్న మూడు కోట్ల రూపాయలు శివప్రసాద్ అన్న వదినలకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆర్బీఐ వద్ద తనకు 17 వందల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని.. అందుకు 15 కోట్లు పన్ను చెల్లించాలంటూ నాగమణిని శివప్రసాద్ మోసం చేశాడు.

మహిళకు చెందిన పదికోట్ల భూమిని, బెంగళూరులో ఉన్న 15 కోట్ల బిల్డింగును అమ్మేసి తన ఆస్తిని శివప్రసాద్ కాజేశాడని నాగమణి గ్రీవెన్స్ సెల్ను ఆశ్రయించింది. శివప్రసాద్ ఆచూకీ కనుగొన్న నాగమణి, శివప్రసాద్ సంతోషంగా తన భార్యా పిల్లలతో ఉండడాన్ని గమనించి మోసపోయానని గ్రహించింది. కరోనా సమయంలో తన భార్యాపిల్లలు చనిపోయారని శివప్రసాద్ చెప్పింది పచ్చి అబద్ధం అని నాగమణికి అర్థమైపోయింది. తనకు ఆర్థికంగా నష్టం చేయడమే కాకుండా మానసిక వేదనకు కారణమైన శివప్రసాద్పై సోమవారం చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో నాగమణి ఫిర్యాదు చేసింది. తనను వంచించి 25 కోట్లు మోసం చేశాడని, న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.