
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మూడో టెస్టుకు ముందు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. తొలి టెస్టులో ఓడిపోయినా రెండో టెస్టులో భారీ విజయం జట్టులో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక ఇప్పుడు మూడో టెస్టుపై పూర్తి దృష్టి పెట్టనుంది. లండన్ లోని ఐకానిక్ లార్డ్స్ గ్రౌండ్ లో జూలై 10 నుంచి 14 వరకు మూడో టెస్ట్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ పై పట్టు సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. మూడో టెస్టులో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా రెండు మార్పులతో గిల్ సేన బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది.
రెండో టెస్టులో ఇంగ్లాండ్ పై సంపూర్ణ ఆధిపత్యం చూపించినప్పటికీ కొంతమంది ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. బ్యాటింగ్ విభాగంలో కరుణ్ నాయర్ మినహాయిస్తే మిగిలిన వారందరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. తొలి రెండు టెస్టుల్లో వచ్చిన అవకాశాలను కరుణ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాలుగు ఇన్నింగ్స్ ల్లో 100 పరుగులు కూడా చేయలేదు. దీంతో కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ కు ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెండు విభాగాల్లో ఘోరంగా విఫలమయ్యాడు.
బ్యాటింగ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైన నితీష్.. బౌలింగ్ లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో నితీష్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే శార్దూల్ ఠాకూర్ కు మరో అవకాశం దక్కొచ్చు. మూడో టెస్టుకు ఇప్పటికే స్టార్ బౌలర్ బుమ్రా అందుబాటులో ఉంటాడని గిల్ కన్ఫర్మ్ చేశాడు. భారీగా పరుగులు సమర్పించుకుంటున్న ప్రసిద్ కృష్ణ స్థానంలో బుమ్రా రానున్నాడు. మూడో టెస్టుకు టీమిండియా ఈ మూడు మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది.
లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగే 3వ టెస్టుకు భారత్ ప్లేయింగ్ ఎలెవన్:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్/సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్/శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా