
- ప్లాన్డ్ సిజేరియన్తో బిడ్డకు లుకేమియా ముప్పు..
- నార్మల్ డెలివరీతో పోలిస్తే 21 శాతం ఎక్కువ
- ఆస్తమా, టైప్ 1 డయాబెటిస్ ప్రమాదం కూడా..
- అత్యవసర పరిస్థితుల్లో చేసే సిజేరియన్లకు ఈ ముప్పు లేదట
- స్వీడన్లోని కరోలిన్స్కా వర్సిటీ పరిశోధకుల వెల్లడి
న్యూఢిల్లీ: ముహూర్త బలమనో, దుర్ముహూర్తంలో కానుపు అవుతుందనే టెన్షన్ తోనో కొంతమంది గర్భిణీలు సిజేరియన్ వైపు మొగ్గుచూపుతుంటారు.. ఫలానా సమయంలో బిడ్డకు జన్మనివ్వాలని ప్లాన్ చేసి ఆపరేషన్ ద్వారా డెలివరీ చేయించుకుంటారు. దీనివల్ల తాత్కాలిక సమస్యలతో పాటు పుట్టబోయే బిడ్డకు దీర్ఘకాలంలో లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) వంటి తీవ్ర అనారోగ్య ముప్పు పొంచి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇలా ముందస్తుగా ప్లాన్ చేసి సిజేరియన్ ద్వారా జన్మనిస్తే.. పుట్టిన బిడ్డకు లుకేమియా, ఆస్తమా, అలర్జీలు లేదా టైప్ 1 డయాబెటిస్ తదితర అనారోగ్యాల ముప్పు ఎక్కువగా ఉంటుందని స్వీడన్ పరిశోధకులు పేర్కొన్నారు. తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. రెండు విడతల్లో పదమూడేళ్ల పాటు 25 లక్షల పిల్లల ఎదుగుదలను పరిశీలించి ఈ వివరాలను వెల్లడిస్తున్నట్లు కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్శాస్త్రవేత్తలు తెలిపారు.
]ఈ స్టడీకి సంబంధించిన పరిశోధనా పత్రాన్ని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ ప్రచురించింది. అధ్యయనం జరిపిన కాలంలో స్వీడన్ వ్యాప్తంగా 25 లక్షల మంది జన్మించగా.. అందులో 15.5 శాతం.. అంటే 3.75 లక్షల మంది చిన్నారులు సిజేరియన్ ద్వారా ఈ భూమ్మీదకు వచ్చారని తెలిపారు. పెరిగి పెద్దయ్యాక వారిలో 1,495 మంది లుకేమియా బారిన పడ్డారని కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు వెల్లడించారు.
ప్లాన్డ్ సిజేరియన్లలో ఏంజరుగుతుంది..?
నార్మల్ డెలివరీ సమయంలో పురుటి నొప్పుల కారణంగా లోపల ఉన్న బిడ్డకూడా ఒత్తిడికి గురవుతుందని, తల్లి వెజీనాలోని కొన్ని రకాల బ్యాక్టీరియాకు ఎక్స్ పోజ్ అవుతుందని వివరించారు. సాధారణ కానుపు కష్టమై సిజేరియన్ చేయాల్సి వచ్చిన సందర్భంలోనూ బిడ్డ ఈ ఎక్స్పోజర్కు గురవుతుందన్నారు. అయితే, ప్లాన్డ్ సిజేరియన్ చేసేటపుడు ఈ పరిస్థితి తలెత్తదన్నారు.
ఇంకా పురుటి నొప్పులు రాకముందే సిజేరియన్ చేస్తారు కాబట్టి లోపల ఉన్న బిడ్డపై ఎలాంటి ఒత్తిడి ఉండదని శాస్త్రవేత్తలు వివరించారు. తల్లి వెజినల్ బ్యాక్టీరియా కూడా బిడ్డను చేరే అవకాశం లేదని తెలిపారు. ఈ రెండు కారణాల వల్ల ప్లాన్డ్ సిజేరియన్ ద్వారా పుట్టిన బిడ్డ భవిష్యత్తులో అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా (ఏఎల్ఎల్) బారిన పడే ముప్పు మిగతా వారితో పోలిస్తే 21% ఎక్కువగా ఉంటుందని చెప్పారు.