ఆసిఫ్ నగర్‎లో ఇద్దరు గల్లంతు.. నాలాలో కొట్టుకుపోయిన మామ అల్లుడు

ఆసిఫ్ నగర్‎లో ఇద్దరు గల్లంతు.. నాలాలో కొట్టుకుపోయిన మామ అల్లుడు

హైదరాబాద్‎లో ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి వర్షం దంచికొట్టింది. గంట వ్యవధిలోనే ఏకంగా 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. రికార్డ్ స్థాయిలో కురిసిన భారీ వర్షానికి సిటీలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ఆసిఫ్ నగర్‎లో ఇద్దరూ వరదలో గల్లంతయ్యారు. అఫ్జల్ సాగర్ మంగారు బస్తీలోని నాలాలో మామ అల్లుడు కొట్టుకుపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

 నాలాలో గల్లంతైన మామ అల్లుళ్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఓ వైపు వర్షం.. మరోవైపు చీకటి పడటంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టతరంగా మారింది. అప్జల్ సాగర్ నాలా దాటుతుండగా మామ అల్లుడు అందులో పడిపోయినట్లు సమాచారం. గల్లంతైన ఇద్దరూ 30 సంవత్సరాలు లోపు వారేనని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉండగా.. ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి కురిసిన భారీ వర్షానికి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో ప్రహారీ గోడ కూలి ఇద్దరూ మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.