ఫోకసంతా టెన్త్ స్టూడెంట్లపైనే

ఫోకసంతా టెన్త్ స్టూడెంట్లపైనే
  • బడుల్లో ఇప్పటికే  స్పెషల్ క్లాసులు మొదలు 
  • నెలాఖరు నాటికి సిలబస్ పూర్తి చేసేలా చర్యలు 
  • డల్ స్టూడెంట్లపై టీచర్లు, హెడ్మాస్టర్ల ప్రత్యేక శ్రద్ధ
  • డైరెక్టరేట్ నుంచి కనిపించని మానిటరింగ్

హైదరాబాద్, వెలుగు: టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల కావడంతో అందరి దృష్టి ఆ స్టూడెంట్లమీదనే పడింది. మే నెలలో పరీక్షలు ప్రారంభం కానుండటంతో.. ఈ మేరకు స్టూడెంట్లను టీచర్లు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా దాదాపు అన్ని స్కూళ్లలో టెన్త్ సిలబస్​ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్​తో మూడేండ్ల తర్వాత పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ.. స్కూళ్లలో టీచర్లు, హెడ్​మాస్టర్లు మినహా.. విద్యాశాఖ చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.

సిలబస్ పూర్తికి ప్రత్యేక క్లాసులు
రాష్ట్రంలో మొత్తం 11,921 హైస్కూళ్లు​ ఉండగా.. వాటిలో టెన్త్ క్లాస్ స్టూడెంట్లు 5.20 లక్షల మంది ఉన్నారు. వీళ్లలో 2 లక్షల మందికి పైగా సర్కారు స్కూళ్లలోనే చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈ అకాడమిక్ ఇయర్ 70% సిలబస్​నే పరిగణలోకి తీసుకుంటామని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 10 లోపే టెన్త్ సిలబస్ పూర్తిచేయాలి. సంక్రాంతి సెలవుల కారణంగా ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారలు హెడ్మాస్టర్లకు సూచించారు. మ్యాథ్స్ మినహా మిగిలిన అన్ని సబ్జెక్టుల సిలబస్ అనుకున్న టైమ్​లోగా పూర్తికావొచ్చిన హెడ్మాస్టర్లు చెప్తున్నారు. మార్చిలో ప్రీఫైనల్ ఎగ్జామ్స్ కూడా పెట్టేందుకు ఏర్పాట్లు  చేస్తున్నారు. ఇప్పటికే మే11 నుంచి 20 దాకా టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు పరీక్షల విభాగం షెడ్యూల్ ప్రకటించింది. దీంతో హెడ్మాస్టర్లు, టీచర్లే బడుల్లో ప్రతి రోజు అదనంగా ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట స్పెషల్  క్లాసులు తీసుకుంటున్నారు. డల్ స్టూడెంట్లపై హెచ్​ఎంలు, టీచర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. కనీసం పాస్ మార్కులు వచ్చేలా వాళ్లను చదివిస్తున్నారు. 

మూడేండ్ల తర్వాత పరీక్షలు
రాష్ట్రంలో కరోనా ప్రభావంతో  2019–20,  2020–21 అకడమిక్ ఇయర్లలో అందరిన్నీ పాస్ చేశారు. ఇపుడు అందరి దృష్టి ప్రస్తుతం జరిగే పరీక్షలపై పడింది. ఏడో తరగతి పరీక్షలు రాసిన స్టూడెంట్లు ఆతర్వాత కరోనా ఎఫెక్టుతో 8,9 పరీక్షలు రాయకుండానే ప్రమోట్ అయ్యారు. ఇపుడు వాళ్లంతా టెన్త్ పరీక్షలు రాయబోతున్నారు. దీంతో వారిని  పరీక్షలకు ఎలా సిద్ధం చేయాలనే దానిపై టీచర్లు  కసరత్తు చేస్తున్నారు.

డైరెక్టరేట్  ఫోకసేదీ!
గతంలో డిసెంబర్ నుంచే టెన్త్ ఎగ్జామ్స్ పై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ నుంచి డీఈవోలతో సమావేశాలు పెట్టి సమాయత్తం చేసే ప్రక్రియపై ఆదేశాలు వచ్చేవి. కానీ ఈ ఏడాది డైరెక్టరేట్ అధికారులు, డీఈవోలంతా జీవో 317పై నిమగ్నమయ్యారు. దీంతో పదో తరగతి విద్యార్థులపై ఫోకస్ తగ్గింది. యాదాద్రి భువనగిరితో పాటు ఒకటీ, రెండు  జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదు. ప్రస్తుతం టీచర్ల అలకేషన్ ప్రక్రియ దాదాపు ముగింపునకు రావడంతో టెన్త్ స్టూడెంట్లపై ఫోకస్ పెట్టాలని హెడ్మాస్టర్లు, టీచర్లు అధికారులను కోరుతున్నారు.