
- స్థానికుల ఫిర్యాదుతో పోలీసుల రంగ ప్రవేశం
- దర్గా కోసమే తవ్వుతున్నామన్న ఫామ్ హౌస్ ఓనర్
శంషాబాద్, వెలుగు : గుప్త నిధుల కోసం ఓ ఫామ్ హౌస్ వద్ద తవ్వకాలు జరిపిన ఘటన శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధి తొండు పల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ తొండుపల్లి గ్రామం నుంచి హమీదుల్లా నగర్ కు వెళ్లే రోడ్డులో వైట్ గెస్ట్ హౌస్ పక్కన రెండు ఎకరాల స్థలాన్ని పాతబస్తీ పురానీ హవేలీకి చెందిన అత్తర్ కొన్ని ఏళ్ల క్రితం అక్తర్ అనే వ్యక్తికి విక్రయించాడు.
45 రోజులుగా ఈ స్థలంలోని వేప చెట్టు ప్రాంతంలో దాదాపు 1020 ఫీట్ల లోతుతో అక్తర్ భారీ సొరంగం తవ్వకాలు జరుపుతున్నాడు. స్థానికులు చూసి శంషాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వచ్చి సొరంగాన్ని చూసి షాక్ అయ్యారు. సుమారు 20 ఫీట్ల వరకు సొరంగాన్ని తవ్వారు. అక్కడ తంత్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.
అక్తర్ మాట్లాడుతూ.. దాదాపు 25 ఏళ్ల క్రితం ల్యాండ్ కొనుగోలు చేసినట్లు చెప్పాడు. ఓల్డ్ ఏజ్ కోసం అద్దెకిచ్చామని, ఈ మధ్యనే వారు ఖాళీ చేయడంతో దర్గా కోసం తవ్వకాలు చేపట్టినట్లు పేర్కొన్నాడు. తన సొంత స్థలంలో తవ్వకాలు జరిపితే గుప్త నిధుల కోసం తవ్వినట్లు ఎవరో తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఇది గుప్త నిధుల కోసం కాదని చెప్పాడు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వెంటనే సొరంగాన్ని మూసివేయాలని ఆదేశించారు.