నిజామాబాద్, వెలుగు : ప్రతినెలా తనకు లంచం ఇవ్వాలని, లేకుంటే జాబ్ పోగొడతానని బెదిరిస్తున్న వ్యక్తిపై నగర ఎక్సైజ్ సీఐ స్వప్న శుక్రవారం సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంకు చెందిన దానయ్యగౌడ్ తెలంగాణ కల్లుగీత వృత్తి సంఘానికి ప్రెసిడెంట్‌ను అంటూ కొంత కాలంగా రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని ఎక్సైజ్ ఆఫీసర్లను ముడుపులు ఇవ్వాలని బెదిరించేవాడు. లేకుంటే వారిపై ఉన్నతాధికారులకు ఇష్టమొచ్చినట్లు ఫిర్యాదులు ఇచ్చేవాడు.
ఈ రకంగా నగర ఎక్సైజ్ సీఐ స్వప్నకు పలుమార్లు ఫోన్ చేసి మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. స్వప్నపై ఏసీబీకి ఫిర్యాదు చేశానంటూ బోగస్ పేపర్స్‌ను ఆమె వాట్సాప్‌కు పంపాడు. లంచం ఇవ్వకుంటే ఉద్యోగం ఊడగొట్టిస్తానంటూ వేధించాడు. దీంతో సీఐ స్వప్న సీపీ సాయిచైతన్యను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. స్పందించిన సీపీ నాలుగో టౌన్లో కేసు నమోదు చేయించి దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
