బీర్లు వాడే కాల పరిమితి 9 నెలలు

బీర్లు వాడే కాల పరిమితి 9 నెలలు

హైదరాబాద్, వెలుగు: బీర్లను వినియోగించే గడువును మరో 3 నెలలు పెంచాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం 6 నెలలు ఉండగా, 9 నెలలకు పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫైల్ పంపించింది. సాధారణంగా అన్ని ఉత్పత్తులపై ఉన్నట్లు బీర్లపై ఎక్స్ పైరీ డేట్ ఉండదు. బెస్ట్ బిఫోర్ యూజ్ అని ఉంటుంది. అంటే గడువు ముగిసిన తర్వాత కూడా బీర్ తాగితే ఇబ్బందులేం ఉండవని అధికారులంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ రావని చెబుతున్నారు. కానీ గడువు లోపలే తాగితేనే  బాగుంటుందంటున్నారు. బీర్ల షెల్ఫ్ లైఫ్ (కాల పరిమితి) పెంచాలని నిర్ణయించిన ఎక్సైజ్ శాఖ.. అందుకు అనుగుణంగా వాటి తయారీకి సంబంధించి గైడ్ లైన్స్ రూపొందిస్తోంది. ఒకవేళ ఉన్నతాధికారులు ఆమోదం తెలిపితే, రాష్ట్రంలోని ఆరు బ్రూవరీస్ కొత్త నిబంధనల మేరకు బీర్లను తయారు చేయాల్సి ఉంటుంది. 

ఎందుకీ మార్పు? 

సాధారణంగా మద్యం దుకాణాల్లో స్టాక్ ఎప్పటికప్పుడు అమ్ముడుపోతూనే ఉంటుంది. అయితే వానాకాలం, చలికాలంలో బీర్ల అమ్మకాలు తక్కువగా ఉంటాయి. వీటికి బదులు ఐఎంఎల్ లిక్కర్ ఎక్కువ సేల్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో మిగిలిపోయిన బీర్లను కొంతకాలం నిల్వ చేయాల్సి ఉంటుంది. కానీ అంతలో బెస్ట్ బిఫోర్ యూజ్ టైమ్ అయిపోతే వాటిని ఎక్సైజ్ శాఖ అధికారులే సీజ్ చేస్తున్నారు. ఫలితంగా ఆ స్టాక్ అంతా వృథా అయిపోతోంది. దీనిపై స్టడీ చేసిన అధికారులు.. చివరకు వాటి కాలపరిమితి పెంచాలని నిర్ణయించారు. 

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు.. 

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో బీర్ల కాలపరిమితి 9 నెలలు ఉంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్నాటకలో 9 నెలల కాలపరిమితితోనే బీర్లను తయారు చేస్తున్నారు. మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా బీర్లు సరఫరా అవుతుంటాయి. అయితే వాటిపై 6 నెలల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మన రాష్ట్రంలోని నిబంధనలనే ఆ కంపెనీలు పాటిస్తున్నాయి. దీంతో నిబంధనలు మార్చాలని నిర్ణయించారు.