ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు అవసరమే.. త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటాం

ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు అవసరమే.. త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటాం
  • ఈ అంశం సీఎం రేవంత్ పరిశీలనలో ఉంది: మంత్రి జూపల్లి
  •     ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు అండగా ఉంటామని వెల్లడి
  •     మెరుగైన వైద్యం అందిస్తున్నాం: మంత్రి దామోదర
  •     నిమ్స్​లో సౌమ్య కుటుంబ సభ్యులకు పరామర్శ

హైదరాబాద్, వెలుగు: స్మగ్లర్ల దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఎక్సైజ్ శాఖ సిబ్బందికి కూడా ఆయుధాలు అందించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని నిమ్స్ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఆయన సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడారు. 

గంజాయి ముఠాలను పట్టుకునే క్రమంలో అధికారులపై దాడులు జరుగుతుండటం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు, సిబ్బంది ఆత్మరక్షణ కోసం ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలనలో ఉందని, దీనిపై ఆయనతో చర్చించి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

అధికారులపై దాడులు సహించం

విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి జూపల్లి హెచ్చరించారు. ‘‘సౌమ్యపై దాడి కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు పంపినం. పరారీలో ఉన్న మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

నిందితులకు చట్టపరంగా శిక్షలు పడేలా చూస్తాం. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని రూపుమాపేందుకు ప్రభుత్వం సీరియస్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నది. ఇప్పటి దాకా రాష్ట్రవ్యాప్తంగా 1,354 కేసుల్లో 2,457 మందిపై ఎఫ్ఐఆర్‌‌‌‌‌‌‌‌లు నమోదు చేశాం. 5,196 కిలోల గంజాయిని సీజ్ చేశాం. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 110 మందిపై 70 కేసులు పెట్టాం’’అని జూపల్లి వెల్లడించారు.

 గంజాయి ముఠాను అడ్డుకోవడంలో సౌమ్య చూపిన తెగువ అద్భుతమన్నారు. ‘‘ఆమె వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తది. కుటుంబానికి పూర్తి అండగా ఉంటాం. కోలుకున్న తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిని బట్టి విధులు కేటాయిస్తాం. డ్యూటీ చేయలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందిస్తాం’’అని జూపల్లి తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ ఖురేషి, డిప్యూటీ కమిషనర్లు సోమిరెడ్డి, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.

సౌమ్య హెల్త్ కండీషన్ క్రిటికల్​గానే ఉన్నది: మంత్రి దామోదర

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి నిమ్స్‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. సోమవారం ఆయన నిమ్స్ కు వెళ్లి సౌమ్యను పరామర్శించారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డాక్టర్లను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సౌమ్య తల్లి చంద్రకళ, సోదరుడు శ్రావణ్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు. 

‘‘సౌమ్య కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఆమె హెల్త్ కండీషన్ క్రిటికల్​గానే ఉన్నది. నిమ్స్‌‌‌‌‌‌‌‌లోని సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం అత్యాధునిక వసతులతో చికిత్స అందిస్తున్నది. సౌమ్య త్వరగా కోలుకుంటుం దని ఆశిస్తున్నం”అని దామోదర రాజనర్సింహ చెప్పారు. ఆయన వెంట హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ, ఇతర అధికారులు ఉన్నారు.