- తొమ్మిది మంది సస్పెన్షన్
- నిజామాబాద్ జిల్లా ఆలూర్, మెండోరాలో ఘటన
నిజామాబాద్, వెలుగు: టెన్త్ పరీక్ష సమయంలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలు సెల్‌ఫోన్ ద్వారా బయటకు వెళ్లిన ఘటనపై నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో తొమ్మిది మంది టీచర్లను సస్పెండ్ చేశారు. వివరాల ప్రకారం.. ఆలూర్ మండలంలోని జడ్పీ హైస్కూల్‌లో బుధవారం పరీక్ష జరుగుతున్న సమయంలో ఇన్విజిలేటర్‌గా ఉన్న ఎన్.సాగర్, క్లర్క్‌గా విధులు నిర్వహించిన ఉమేందర్ రూల్స్‌కు విరుద్ధంగా సెల్‌ఫోన్‌ను ఎగ్జామ్ సెంటర్లోకి తీసుకెళ్లారు.
పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థి దగ్గర నుంచి తెలుగు ప్రశ్నాపత్రాన్ని తీసుకున్న ఉమేందర్ దానిని ఫొటో తీసి వాట్సాప్ ద్వారా బయటకు పంపాడు. తన బంధువుల పిల్లవాడి కోసం పంపిన ఈ క్వశ్చన్ పేపర్ తర్వాత వైరల్ అయింది. ఈ విషయం పోలీసులకు చేరడంతో డీఈవో అశోక్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆలూర్ చేరుకుని విచారణ జరిపిన డీఈవో, కలెక్టర్‌కు నివేదిక అందించారు. దీంతో సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ రాజేందర్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ విజయ్‌కుమార్, ఇన్విజిలేటర్ ఎన్.సాగర్, క్లర్క్ ఉమేందర్ ను సస్పెండ్ చేశారు.
మెండోరా స్కూల్లో హిందీ పేపర్..
ఇక మెండోరా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మరో ఘటనలో హిందీ ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి పంపిన ఘటనలో ఎస్జీటీ భూపతి, జీహెచ్ఎం మమత, ఎస్ఏలు రవీందర్, వేణు, ఆశీర్వాదంను కూడా సస్పెండ్ చేశారు. భూపతి ఫొటో తీసిన పేపర్ ను పొరపాటున వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడంతో వైరల్ అయింది. పర్యవేక్షణ లోపాలపై సంబంధిత ఇన్విజిలేటర్లు, అధికారులపై మరిన్ని చర్యలు తీసుకోవాలని డీఈవో సిఫారసుచేశారు.
