
- వాళ్లను దెబ్బతిస్తే బిజినెస్ దెబ్బతింటదట..
- మద్యం వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ హితబోధ
- వీలైతే ఎంఆర్పీ రేటుకే సరుకు ఇవ్వాలట..
- ధరలు అందుబాటులో ఉంటే ఎక్కువ మంది తాగుతారట
- దసరా సేల్స్ పెంచేందుకు జిల్లాలవారీగా మీటింగులు
నల్గొండ, వెలుగు : ‘ఊరూరా బెల్టుషాపులు ఉంటేనే చాలదు, లిక్కర్ రేట్లు కూడా అందుబాటులో ఉండాలి.. అప్పుడే జనం బాగా తాగుతరు.. సర్కారు మనకు పెట్టిన టార్గెట్ ఈజీగా రీచ్ కావచ్చు.. అందువల్ల మీరంతా బెల్టుషాపులోళ్లను ప్రోత్సహించాలి.. ఎంఆర్పీ రేటుకే, మహాఅయితే బాటిల్‌పై ఓ పది రూపాయలు చూసుకొని బెల్టుషాపులకు సరుకు ఇవ్వండి..’ లిక్కర్ వ్యాపారులకు ఎక్సైజ్ ఆఫీసర్లు ఇస్తున్న సలహా ఇది! దసరా సందర్భంగా అమ్మకాలు పెంచాలనే లక్ష్యంతో జిల్లాలవారీగా వ్యాపారులతో మీటింగులు పెడ్తున్న ఆబ్కారోళ్ల మాటలు విని మద్యం వ్యాపారులు ఒకరిమొఖాలు ఒకరు చూసుకుంటున్నారు. గతంలో ఎక్కడైనా బెల్టుషాపు కనిపిస్తే చాలు, దాడులు చేసి, కేసులు పెట్టిన ఆ ఎక్సైజ్ ఆఫీసర్లే తీరా ఇప్పుడు బెల్టుషాపులను ప్రోత్సహించాలని చెప్తుండడంతో ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎందుకీ పరిస్థితి..
ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరకపోయిన రాష్ట్రసర్కారుకు లిక్కర్ ఆదాయమే పెద్ద దిక్కవుతోంది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఇన్‌కంతోనే ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలు ఇస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో లిక్కర్ ఆదాయాన్ని భారీగా పెంచడంపై రాష్ట్ర సర్కారు దృష్టిపెట్టింది. గతేడాది మద్యం అమ్మకాల ద్వారా రూ.20,447 కోట్లు రాగా, ఈ ఏడాది రూ.40వేల కోట్లు రాబట్టాలని ఆబ్కారోళ్లకు సర్కారు టార్గెట్ పెట్టింది. ఇందుకు అనుగుణంగా మే నెలలో రిటైల్ లిక్కర్ రేట్లు పెంచారు. బ్రాండ్లను, బాటిళ్ల సైజును బట్టి రూ.20 నుంచి రూ.160 దాకా పెంచారు. బ్రాండ్లు, సైజుతో సంబంధం లేకుండా ప్రతి బీరుపై రూ.10 చొప్పున బాదేశారు. అప్పటికీ అనుకున్నంత ఆదాయం రాకపోవడంతో జిల్లాలవారీగా టార్గెట్లు పెంచుతున్నారు. గతంలో ఏడాదికి 10శాతం పెంచాలనే టార్గెట్ ఉండగా, ఈసారి 20శాతం చేశారు. ఉదాహరణకు ఒకషాపులో గతేడాది సెప్టెంబర్‌లో రూ.10 లక్షల సరుకు అమ్మితే ఈసారి సెప్టెంబర్‌లో రూ.12 లక్షల సరుకు అమ్మాలని చెప్తున్నారు. దీంతో లిక్కర్వ్యాపారులు బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే ఊరూరా 5 నుంచి 10 దాకా బెల్టుషాపులు వెలిశాయి. ఎన్నికలు జరుగుతున్న మునుగోడులాంటి నియోజకవర్గంలోనైతే కిరాణషాపుల్లోనూ మద్యం అమ్ముతున్నారు.
దసరా టూ న్యూ ఇయర్..
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఐదు నెలల వ్యవధిలో లిక్కర్ అమ్మకాల ద్వారా రూ.15వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. దసరా నుంచి న్యూ ఇయర్దాకా ఇదే ఊపు కొనసాగిస్తే రూ.40వేల టార్గెట్ రీచ్ కావడం కష్టం కాదని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. అదే సమయంలో ఈ స్థాయి ఆదాయానికి కారణమవుతున్న బెల్టుషాపులను కాపాడుకోవాలని మద్యం వ్యాపారులకు చెప్తున్నారు. దసరా నేపథ్యంలో జిల్లాలవారీగా మద్యం వ్యాపారులతో మీటింగులు పెడ్తున్న ఆబ్కారీ ఆఫీసర్లు ఇటీవల నల్గొండలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చకు వచ్చాయి. వైన్స్‌ల నుంచి బెల్టుషాపులకు సరుకు ఇచ్చేటప్పుడు ఎంఆర్పీ మీద ఒక్కో బాటిల్‌కు రూ.10 నుంచి రూ.20వరకు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాళ్లు గ్రామాలకు వెళ్లి మరో రూ.10 నుంచి రూ.20 దాకా పెంచి అమ్ముతున్నారని తెలిసిందన్నారు. అంతిమంగా వినియోగదారులు నష్టపోతున్నారని, ఫలితంగా సేల్స్‌లో తగ్గుదల కనిపిస్తోందని ఆబ్కారీ ఆఫీసర్లు విశ్లేషించారు. అదీగాక ఒక్కో సిండికేట్ పరిధిలో ఒక్కో రేటు అమలువుతున్నట్లు గుర్తించామన్నారు. ఇకపై ఇలా వద్దని, ఎట్టిపరిస్థితుల్లోనూ బెల్టుషాపుల నుంచి ఎంఆర్పీ మాత్రమే తీసుకోవాలని, అప్పుడు వాళ్లు రూ.5, రూ.10 ఎక్కువ తీసుకున్నా పెద్దగా పోయేదేం లేదని చెప్పినట్టు సమాచారం. ఈక్రమంలోనే బెల్టుషాపులకు ఎంఆర్పీకే లిక్కర్ అమ్మేలా వ్యాపారులతో ఒప్పంద పత్రాలు కూడా రాయించుకున్నట్లు ఒక ఎక్సైజ్ ఆఫీసర్‘వెలుగు’ తో చెప్పారు. కొన్నిచోట్ల సిండికేట్ ఏదైనా ఎంఆర్పీకి మించి రూ.10 కంటే ఎక్కువ వసూలు చేయవద్దని ఏకంగా తీర్మానాలు చేయిస్తున్నట్లు వైన్స్‌షాప్ ఓనర్లు చెప్తున్నారు. మొత్తం మీద సర్కారు టార్గెట్లు చేరుకోవడం కోసం ఇన్నాళ్లూ బెల్టుషాపులను చూసీచూడనట్లు వదిలేసిన ఆబ్కారోళ్లు ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి ఏకంగా బెల్టుషాపులను బతికించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.