
- ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని వైన్ షాపుల దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య తెలిపారు. శుక్రవారం కొత్తగూడెంలో సూపరింటెండెంట్ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలోని 88వైన్ షాపులకు గానూ 44షాపులకు ఎస్టీలకు కేటాయించనట్లు వెల్లడించారు. గౌడ్స్ కు ఆరు, ఎస్సీలకు ఏడు షాపులతో పాటు ఎస్టీలకు ఏఏ షాపులు రిజర్వ్ అయ్యాయో కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆఫీస్లో అందుబాటులో ఉంచామన్నారు.
ఒకరు ఎన్ని షాపులకైనా ఎన్ని దరఖాస్తులైనా వేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. మొదటి రోజైన శుక్రవారం ఒక్క దరఖాస్తు కూడా రాలేదన్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఆవరణలో ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. వచ్చే నెల 23న కొత్తగూడెం క్లబ్లో షాపులకు సంబంధించి డ్రా తీయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త షాపులు ఓపెనింగ్ అవుతాయన్నారు.
ఖమ్మం టౌన్ : నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా మద్యం షాపుల నిర్వహణకు ఆసక్తి గలవారు అక్టోబర్ 18 లోపు దరఖాస్తులు దాఖలు చేయాలని ఖమ్మం జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ జి. నాగేంద్ర రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 116 మద్యం షాపుల వేలం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుదారుడు రూ.3 లక్షల డీడీ లేదా చలాన్ రూపంలో చెల్లించాలని తెలిపారు.
జిల్లా మద్యపాన నిషేధ అధికారి, ఖమ్మం పేరిట డీడీ తీయాలని, దరఖాస్తుతో పాటు పాన్ కార్డు, ఆధార్ కార్డు సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ, కుల ధ్రువీకరణ పత్రం జత చేయాలని, దరఖాస్తులను ఖమ్మం కొత్త కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న ఎక్సైజ్ స్టేషన్ లో సమర్పించాలని పేర్కొన్నారు. దరఖాస్తులను ఖమ్మం లోని లేక్ వ్యూ ఫంక్షన్ హాల్ లో అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు డ్రా ద్వారా కేటాయిస్తారని తెలిపారు.