
- మత్తు పదార్థాలను చిత్తు చేయాలి
- కింగ్‌పిన్‌లను పీడీ యాక్టు కింద అరెస్టు చేయాలి
- అధికారులకు ఎక్సైజ్ మంత్రి జూపల్లి ఆదేశం
- గ్రామాలు, ఇతర మార్గాలపైనా నిఘా పెంచాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ఎక్సైజ్ అధికారులకు అవసరమైతే ఆయుధాలు ఇస్తామని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, నాటుసారా, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) వంటి నేరాలను అణచివేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మాదకద్రవ్యాల సరఫరాలో కీలకపాత్ర పోషించే కింగ్‌పిన్‌లను గుర్తించి పీడీ యాక్టు కింద అరెస్టు చేయాలన్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద మాత్రమే కాకుండా గ్రామాలు, ఇతర మార్గాలపైనా నిఘా పెంచాలని సూచించారు.
ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు ఇవ్వడంపై ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలన్నారు. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్‌లో శనివారం ఆబ్కారీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్టీఎఫ్ అండ్ డీటీఎఫ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యువత భవిష్యత్తును డ్రగ్స్ నాశనం చేస్తున్నాయని, అలాంటి మత్తుపదార్థాల విక్రయాలను అరికట్టాలన్నారు. కల్తీ మద్యం, నాటుసారా, కల్తీ కల్లుతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని, ఇకపై ఇలాంటివి రాష్ట్రంలో కనిపించకూడదని స్పష్టం చేశారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చూడాలన్నారు. చర్లపల్లిలో డ్రగ్స్ ముడిసరుకు తయారీ కేసు పురోగతి గురించి ఆరా తీశారు.
మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.11.95 కోట్లు మాత్రమేనని, రూ.12 వేల కోట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని అధికారులు మంత్రికి వివరించారు. కాగా.. గోవాలో పెన్నీ, మధ్యప్రదేశ్‌లో ఇప్పసారా వంటి సంప్రదాయ మద్యాన్ని బ్రాండింగ్ చేసి విక్రయిస్తున్నారని, అదే తరహాలో రాష్ట్రంలో ఈత, తాటికల్లును ‘టాడీ నేచురల్ బ్రూవరీ’ ద్వారా బాటిలింగ్ చేసి విక్రయిస్తే గీత కార్మికులకు ఉపాధి, ఆదాయం పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. ఒక బార్ లైసెన్స్ తీసుకుని రెండు మూడు బార్లను నడుపుతున్న వారి లైసెన్స్‌లను రద్దు చేయాలని ఆదేశించారు.