యూపీలో రసవత్తర పోరు.. అసెంబ్లీ బరిలో అఖిలేష్

యూపీలో రసవత్తర పోరు.. అసెంబ్లీ బరిలో అఖిలేష్

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికల ఘట్టం రసవత్తరంగా మారింది. నామినేషన్ల పర్వం కావడంతో ప్రధాన అభ్యర్థులెవరు.. వారి ప్రత్యర్థులెవరన్న సస్పెన్స్ కు తెరపడుతోంది. ఊహించినట్లు అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం అజాంఘడ్ నుంచి లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నఆయన తొలిసారిగా అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. తన కుటుంబానికి కంచుకోట అయిన మెయిన్ పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఇవాళ సన్నిహితులతో కలసి నామినేషన్ దాఖలు చేశారు.

మెయిన్పురి లోక్సభ నియోజకవర్గానికి అఖిలేష్ యాదవ్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. కర్హాల్ లో సైతం గతంలో ఎస్పీకి గట్టి పట్టుంది. 1993 నుంచి 2002కు జరిగిన ఎన్నికల్లో కర్హాల్ లో ఎస్పీ విజయఢంకా మోగించింది. ఆ నియోజకవర్గంలో 37శాతం మంది యాదవులే కావడం సమాజ్ వాదీ పార్టీకి కలిసిరానుంది. 

అఖిలేష్ కు పోటీగా కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్

అసెంబ్లీ బరిలోకి దిగిన అఖిలేష్  యాదవ్ ను దీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ కేంద్ర మంత్రిని బరిలోకి దింపుతోంది. అగ్రా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ ను అభ్యర్థిగా నిర్ణయించింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎన్నికలు సెమీ ఫైనల్ గా పరిగణిస్తుండడంతో పోటీ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతున్న ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ తేదీ వరకు ఏడు విడతల్లో జరగనుంది. దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఎన్నికల్లో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలు హోరా హోరీగా పోరాడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్, ప్రియాంక గాంధీలతోపాటు స్టార్ క్యాంపెయినర్లను దించి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. 

 

ఇవి కూడా చదవండి

ఫిబ్ర‌వ‌రి 8న తిరుమ‌ల‌లో ఏకాంతంగా రథసప్తమి

AP:రిటైర్మెంట్ 62 ఏళ్లు.. గవర్నర్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు