- దాని వల్ల ప్రజలకు కంటిమీద కునుకులేదు: హరీశ్ రావు
- తెలంగాణ భవన్‌లో మూసీ బాధితులతో సమావేశం
- అండగా ఉంటామని హామీ
- బుల్డోజర్లను ఆపాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి
హైదరాబాద్/పద్మారావునగర్, వెలుగు: రాష్ట్రంలో హైడ్రా హైడ్రోజన్ బాంబులా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. దాని వల్ల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని మండిపడ్డారు. మూసీ రివర్‌బెడ్‌లో ఉన్న ఇండ్లను ప్రభుత్వం తొలగిస్తున్నందున, వాటి యజమానులతో శనివారం తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తొలగిస్తున్న ఇండ్ల ఓనర్లకు తాము అండగా ఉంటామన్నారు.
బీఆర్‌ఎస్ న్యాయవాదుల బృందం 24 గంటలు బాధితుల సహాయం కోసం తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉంటుందన్నారు. తన సోదరుడికి నోటీసులు ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చిన సీఎం రేవంత్.. పేదోళ్ల ఇండ్లను రాత్రికి రాత్రే కూల్చి వేయిస్తున్నారని హరీశ్ రావు దుయ్యబట్టారు. మొత్తం 25 వేల ఇండ్లను కూల్చేందుకు ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు. కష్టపడి దాచుకున్న సొమ్ముతో ప్రజలు ఇండ్లు నిర్మించుకుని, రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే ప్రభుత్వం వాటిని కూల్చేయడం దారుణమన్నారు.
తమ ప్రభుత్వంలో కాళేశ్వరం నిర్మిస్తే ప్రజలకు సాగు, తాగు నీరు అందాయని.. మూసీ సుందరీకరణతో వచ్చే ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానని చెప్తూ.. పేద, మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లను పారించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఫైర్అయ్యారు. ఇకనైనా కూల్చివేతలు ఆపి, పేదలకు పనికొచ్చే పని చేయాలని హరీశ్ రావు సీఎం రేవంత్‌కు సూచించారు. హైడ్రా మీద అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు.
ఆ తర్వాతే మూసీ విషయంలో ముందుకెళ్లాలన్నారు. తెలంగాణలో నడుస్తున్న బుల్డోజర్ రాజ్యాన్ని ఆపాలని రాహుల్‌గాంధీకి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. పలువురు బాధితులు తమ బాధను సమావేశంలో హరీశ్‌రావుకు తెలిపారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. కూకట్ పల్లిలో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ పార్ధివదేహానికి హరీశ్‌రావు నివాళులు అర్పించారు. ఆయన వెంట సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు ఉన్నారు.
