న్యూఢిల్లీ, వెలుగు: ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో ఎంపీలు గొడెం నగేశ్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, అలాగే ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డిల బృందం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమైంది.
దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైల్వే పెండింగ్ సమస్యలపై చర్చించి, మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. దాదాపు దశాబ్ద కాలంగా ఆదిలాబాద్ – ఆర్మూర్ రైల్వే లైన్ పెండింగ్‌లో ఉందని నేతలు వివరించారు.
కేంద్రంలో బడ్జెట్ కేటాయించి మంజూరు చేసినప్పటికీ ప్రాజెక్ట్ పూర్తి కాలేదని, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అలాగే తెలంగాణలోని ఇతర పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను కూడా త్వరగా పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
