కాళేశ్వరం బ్యారేజీల డ్యామేజీని తేల్చేందుకు ఎక్స్​పర్ట్​ కమిటీ

కాళేశ్వరం బ్యారేజీల డ్యామేజీని తేల్చేందుకు ఎక్స్​పర్ట్​ కమిటీ
  •  చైర్మన్‌‌గా చంద్రశేఖర్ అయ్యర్.. సభ్యులుగా నలుగురు.. మెంబర్ సెక్రటరీగా ఒకరు
  • ఏర్పాటు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ
  • నాలుగు నెలల్లో రిపోర్ట్​ ఇవ్వాలని ఆదేశం
  • రాష్ట్ర సర్కార్​ రాసిన లేఖకు స్పందిస్తూ నిర్ణయం 

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణ పటిష్టత, డ్యామేజీలను తేల్చేందుకు ఎక్స్​పర్ట్స్​ కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్​ఏ) ఏర్పాటు చేసింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్​గా, మరో నలుగురు సభ్యులుగా ఈ కమిటీని నియమించింది. సభ్యులుగా యూసీ విద్యార్థి, ఆర్.పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ ఉన్నారు. ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. 

ఈ మూడు బ్యారేజీలను అధ్యయనం చేసి నాలుగు నెలల్లో  నివేదిక ఇవ్వాలని కమిటీని ఎన్డీఎస్​ఏ ఆదేశించింది. కమిటీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వానికి మార్చి 2న ఎన్డీఎస్​ఏ పాలసీ-రీసెర్చ్​ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిట్టల్ లేఖ రాశారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్ల కుంగుబాటు ఘటనతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం. సుందిళ్ల బ్యారేజీలపై సమగ్ర విచారణ జరపాలని ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. 

మూడు బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల ఆధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ 3 బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ మార్చి 2న ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారేజీలను పరిశీలించి.. కుంగుబాటుకు, పగుళ్లకు  కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని కమిటీకి  సూచించింది.  

సమగ్ర అధ్యయనం

ఎన్టీఎస్​ఏ ఏర్పాటు చేసిన కమిటీ మూడు బ్యారేజీలను క్షేత్రస్థాయిలో విజిట్​ చేసి ఫిజికల్​గా స్టడీ చేయడంతో పాటు సంబంధిత ఇరిగేషన్ అధికారులతో సంప్రదింపులు జరపనుంది. మొత్తం ఏడు అంశాలపై నిశితంగా స్టడీ చేయనుంది. బ్యారేజీలకు సంబంధించిన హైడ్రాలిక్, స్ట్రక్చరల్, జియో టెక్నికల్ అంశాలను అధ్యయనం చేస్తుంది. ప్రాజెక్టు డేటా, డ్రాయింగ్స్, డిజైన్ మెమొరాండంలు, ఇప్పటివరకు చేసిన టెస్టులు, సైట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు, బ్యారేజీ ఇన్‌‌స్పెక్షన్ రిపోర్టులు తదితరాలను పరిశీలించాలని కమిటీకి ఎన్టీఎస్​ఏ స్పష్టం చేసింది. 

పగుళ్లు ఎందుకొచ్చినయ్..?

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు ఎందుకు పగుళ్లు వచ్చాయి..? ఎందుకు కుంగిపోయాయి..? స్ట్రక్చర్‌‌కు ఇబ్బందులు ఎందుకు తలెత్తాయి.. వంటి అంశాలపై స్టడీ చేసి నాలుగు నెలల్లో రిపోర్టును సమర్పించాల్సిందిగా కమిటీని ఎన్టీఎస్​ఏ  ఆదేశించింది. ఈ అధ్యయనం తర్వాత ఇంకా లోతుగా స్టడీ చేయాల్సి వస్తే ఏ తీరులో ఉండాలో సూచించడంతో పాటు ఈ డ్యామేజీని ఇక్కడితోనే నిలిపివేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఇకపైన మరింత డ్యామేజీ జరగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ తదితరాలను కూడా నివేదికలో పొందుపర్చాలని స్పష్టం చేసింది.

కాళేశ్వరంపై కమిటీ రిపోర్ట్ త్వరగా ఇవ్వండి: మంత్రి ఉత్తమ్‌‌
 
కాళేశ్వరంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ తన రిపోర్ట్‌‌ను సాధ్యమైనంత తొందరగా ఇవ్వాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి కోరారు. ఈ నెల 6న కాళేశ్వరం బ్యారేజీల పరిశీలనకు నిపుణుల కమిటీ రానుందని తెలిపారు. వారి రాకను స్వాగతిస్తున్నామని, అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌డీఎస్‌‌ఏ) సూచనలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

 కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని ఎన్‌‌డీఎస్‌‌ఏ పరిశీలించి.. నీటిని ఖాళీ చేయాలని సూచించిందని, వారు చెప్పినట్లే చేశామని ఆదివారం ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన ఎన్‌‌డీఎస్‌‌ఏ.. మేడిగడ్డలో ఉన్న సమస్యలే వాటిల్లోనూ ఉన్నాయని.. ఈ రెండు బ్యారేజీలలో కూడా నీటిని ఖాళీ చేయాలని అప్పుడే చెప్పిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు సాంకేతిక అవగాహన లేకుండా మాట్లాడడం దురదృష్టకరమన్నారు.