కరోనా కథ కంచికి చేరినట్టేనా?.. తుది దశకు చేరుకున్నట్లు నిపుణుల అభిప్రాయం

కరోనా కథ కంచికి చేరినట్టేనా?.. తుది దశకు చేరుకున్నట్లు నిపుణుల అభిప్రాయం
  • ప్రస్తుతం ఒక్కో దేశంలో ఒక్కో వేరియంట్​
  • గతంలో మాదిరిగా గ్లోబల్ గా ఒకే వేరియంట్​విస్తరించని వైనం
  • త్వరలో కరోనా ఎండమిక్​పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన!

పద్మారావునగర్, వెలుగు: ఐదైండ్ల కింద ప్రపంచాన్ని గడగడలాడించి, లక్షలాది మంది ప్రాణాలను హరించిన కరోనా భూతం ఇక అంతిమ దశకు చేరుకుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. 2019లో ఆల్ఫా వేరియంట్ తో ప్రపంచానికి భయం రుచి చూపించిన కొవిడ్​ వైరస్​2025 వరకు ఎన్నో వేరియంట్లతో ఆయా దేశాల్లో వ్యాప్తి చెందుతూనే ఉంది. ప్రస్తుతం జేఎన్1 వేరియంట్ చాలా తక్కువ వ్యాప్తిలో ఉందని, గ్లోబల్ గా ఈ వేరియంట్ ​చివరి దశ అవుతుందని గాంధీ ఆస్పత్రి క్రిటికల్ కేర్ ​మెడిసిన్​ విభాగం ప్రొఫెసర్ ​డాక్టర్ ​కిరణ్​మాదాల అభిప్రాయపడ్డారు.  

ఆదివారం ఆయన వెలుగుతో మాట్లాడుతూ.. కొవిడ్ ​పాండమిక్ ​దశలో ప్రపంచ వ్యాప్తంగా ఒకే వేరియంట్ తీవ్ర స్థాయిలో వ్యాప్తిస్తూ, కోట్లాది మంది ఆరోగ్యాలపై ప్రభావం చూపిందన్నారు. ఆ తర్వాత వైరస్​ ప్రభావం సగం వరకు తగ్గి, కొన్ని దేశాలకే పరిమితమవుతూ మధ్యస్థ స్థాయి (ఎపిడమిక్)కి పడిపోయిందన్నారు. ఇప్పడు ప్రపంచంలోని ఒక  దేశంలో వెలుగు చూసిన వేరియంట్ మరో దేశంలో కనిపించడం లేదన్నారు. దీనిని బట్టి కరోనా ఎండమిక్​ దశకు చేరుకుందని భావిస్తున్నామన్నారు. ఏదైనా వైరస్ ​వ్యాప్తికి సాధారణంగా మూడు దశలు 1. పాండమిక్, 2. ఎపిడమిక్​,3.ఎండమిక్​ఉంటాయన్నారు. 

ప్రస్తుతం సింగపూర్ లో వెలుగు చూసిన ఎన్​బీ1.8.1 వేరియంట్​ మరే దేశంలో లేదన్నారు. అలాగే మనదేశంలోని ఎక్స్​ఎఫ్​జీ వేరియంట్ మరే దేశంలో లేదన్నారు. దీన్ని బట్టి కరోనా వైరస్​బలహీనపడిపోయి, ఆయా దేశాలు, ప్రాంతాలలోని ప్రజల ఇమ్యూనిటీ పవర్​కు అనుగుణంగా అక్కడికే పరిమితమవుతుందని తెలుస్తోందన్నారు. ఒకవేళ వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లయితే ఒకే మాదిరి వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా పాకేదన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలు చేస్తోందని, త్వరలోనే కరోనా ఎండమిక్​పై ప్రకటన రావచ్చని తెలిపారు.