మరోసారి రెపో రేటు పెంపు?

మరోసారి రెపో రేటు పెంపు?

ముంబై: రేట్ల పెరుగుదల ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో మరోసారి బెంచ్​మార్క్​ లెండింగ్​ రేటును పెంచుతారని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నేటి నుంచి మూడు రోజుల పాటు ఇందుకోసం సమావేశం కానుంది. ఈ కమిటీ తన నిర్ణయాన్ని  బుధవారం ప్రకటిస్తుంది. రెపో రేటును కనీసం 35 బేసిస్​ పాయింట్ల దాకా పెంచవచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. మే నెల ఎంపీసీ మీటింగ్​లో రెపో రేటును 40 బేసిస్​ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. దేశంలో రేట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకే వడ్డీ రేట్ల పెంపును ఆర్​బీఐ అమలులోకి తెస్తోంది. దేశంలో రిటెయిల్​ ఇన్​ఫ్లేషన్​ వరసగా ఏడో నెలలోనూ పెరిగి ఏప్రిల్​ నెలలో ఎనిమిదేళ్ల హై 7.79 శాతాన్ని తాకింది. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా పెట్రోలు, డీజిల్​ వంటి కమోడిటీ రేట్లు ఎక్కువగా పెరగడం వల్లే ఇన్​ఫ్లేషన్​ కిందకి దిగి రావడం లేదు. ఇక హోల్​సేల్​ ఇన్​ఫ్లేషన్​ కూడా గత 13 నెలలుగా రెండంకెలలోనే కొనసాగుతోంది. 2022 ఏప్రిల్ నెలలో ఇది ఏకంగా 15.08 శాతానికి చేరింది. రెపో రేటు పెంపుదల ఉంటుందని, ఎంతనేది ఇప్పుడే చెప్పలేనని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ ఇటీవలే ఒక టీవీ ఛానల్​ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కేవలం వడ్డీ రేట్ల కోసమే కాకుండా, గ్రోత్​, ఇన్​ఫ్లేషన్​లపై అంచనాలకు ఎంపీసీ మీటింగ్​ ముఖ్యమైనదని బ్యాంక్​ ఆఫ్​ బరోడా చీఫ్​ ఎకనమిస్ట్​ మదన్​ సబ్నవిస్​ చెప్పారు. ఈసారి రెపో రేటు పెంపుదల 25–35 బేసిస్​ పాయింట్లకు మించి ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు.​ జూన్​లో 40 బేసిస్​ పాయింట్లు, ఆగస్టులో మరో 35 బేసిస్​ పాయింట్ల పెంపుదల ఉంటుందని బ్యాంక్​ ఆఫ్​ అమెరికా తన రిపోర్టులో అంచనా వేసింది.