అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బాణసంచా ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న పేలుడులో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సిటీ శివార్లలోని వస్త్రాల్ ప్రాంతంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో టాలెంట్ ఫైర్‌వర్క్స్ అనే పేరుతో ఈ బాణాసంచా ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీకి ఉన్న లైసెన్స్‌ను అధికారులు గతంలోనే రద్దు చేశారు.
అయినప్పటికీ, నిర్వాహకులు అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ రహస్యంగా ఇక్కడ బాణాసంచా కాంపౌండింగ్, తయారీ పనులు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఈ ఫ్యాక్టరీలో కెమికల్స్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు శబ్దానికి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీశారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం స్థానిక సివిల్ ఆస్పత్రి, మణినగర్‌లోని ఎల్‌జీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికీ అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు.
మృతులకు ప్రధాని మోదీ ఎక్స్‌గ్రేషియా
ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు ప్రధాని కార్యాలయం ‘ఎక్స్’ లో వెల్లడించింది. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
