ఇస్తాంబుల్​లో పేలుడు.. ఆరుగురు మృతి

ఇస్తాంబుల్​లో పేలుడు.. ఆరుగురు మృతి
  • ఇస్తాంబుల్​లో పేలుడు.. ఆరుగురు మృతి.... పదిమందికి పైగా గాయాలు
  • టెర్రరిస్టుల పనేనని ప్రెసిడెంట్ అనుమానం

ఇస్తాంబుల్: తుర్కియే రాజధాని ఇస్తాంబుల్​ లో దారుణం చోటుచేసుకుంది. షాపింగ్​ కోసం వచ్చే జనాలతో నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో పేలుడు జరిగింది. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. జనం భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారని తుర్కియే ప్రెసిడెంట్ తయ్యిప్​ ఎర్డొగాన్​ప్రకటించారు. పేలుడుకు కారణమేంటనేది ఇంకా తెలియరాలేదని, టెర్రరిస్టుల హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటికిప్పుడు టెర్రరిస్టులే ఈ దాడికి పాల్పడ్డారని తేల్చలేమని ఎర్డొగాన్​ వివరించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో పరిస్థితిని ప్రాథమికంగా పరిశీలించిన తర్వాత అధికారులు టెర్రరిస్టు కోణం ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెప్పారన్నారు. పేలుడు ఘటనను ఖండిస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రెసిడెంట్​ ఎర్డొగాన్​ ఈ కామెంట్స్ చేశారు. పేలుడుకు కారణం ఎవరనేది తేల్చేందుకు అధికారులు పరిశోధన చేస్తున్నారని వివరించారు. కాగా, 2015-16 సంవత్సరాలలో కూడా ఇదే ఇస్టిక్లాల్​ షాపింగ్ స్ట్రీట్​ లో బాంబు పేలుళ్ల ఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పుడు జరిగిన వరుస పేలుళ్లలో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోగా.. 2 వేల మందికి పైగా గాయపడ్డారు.

ఆదివారం కావడంతో  రద్దీ ఎక్కువుంది..

సిటీలోనే పేరొందిన ఇస్టిక్లాల్​ షాపింగ్​ స్ట్రీట్.. స్థానికులు, టూరిస్టులతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఆదివారం కావడంతో రద్దీ మరింత ఎక్కువగా ఉందని అక్కడి వ్యాపారస్తుడు ఒకరు చెప్పారు. ఒక్కసారిగా భారీ శబ్దం వినపడడంతో భయాందోళనలకు లోనయ్యానని వివరించారు. పేలుడు జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే ఉన్న మరో వ్యక్తి మాట్లాడుతూ.. భారీ శబ్దం వణికించిందని చెప్పారు. నలుగురు అయిదురు నేలమీద పడిపోవడం చూసినట్లు తెలిపారు.