2022-23లో ఇండియా నుంచి రికార్డుస్థాయిలో ఎగుమతులు

2022-23లో ఇండియా నుంచి రికార్డుస్థాయిలో ఎగుమతులు

న్యూఢిల్లీ:ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా నుంచి ఎగుమతులు రికార్డుస్థాయిలో ఉంటాయని ఎక్స్​పోర్ట్​–ఇంపోర్ట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎగ్జిమ్​బ్యాంక్​) తెలిపింది. ఈ నెల 31తో ముగుస్తున్న ఆర్థిక సంవత్సరంలో 447.3 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు రికార్డు అవుతాయని అంచనా వేసింది. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం వంటి జియోపొలిటికల్​ టెన్షన్లు, గ్లోబల్​ ఎకానమీ స్లోడౌన్​ వంటి సమస్యలు ఉన్నప్పటికీ ఎగుమతుల వృద్ధికి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి–-మార్చిలో భారతదేశపు సరుకుల ఎగుమతుల విలువ 110.9  బిలియన్ డాలర్లు ఉండవచ్చని ఇది పేర్కొంది. ఇదే కాలంలో చమురేతర ఎగుమతులు 87.7 బిలియన్​ డాలర్లకు  చేరుకోవచ్చని అంచనా. ఇండియా 2022 ఆర్థిక సంవత్సరంలో 422 బిలియన్​ డాలర్ల ఆల్-టైమ్ అత్యధిక వార్షిక సరుకుల ఎగుమతులను సాధించింది. 2023 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-డిసెంబర్​ మధ్య ఎగుమతి భాగస్వామిగా నెదర్లాండ్స్ చైనాను మూడవ స్థానం నుంచి పడగొట్టింది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్,  సౌదీ అరేబియా వాటా పెరగడంతో భారతదేశం తన ఎగుమతులను భారీగా పెంచుకుంది. చైనా, యూఎస్​లకు మాత్రం ఎగుమతులు తగ్గాయి. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియాలకు ఎగుమతులు రెండు రెట్లు పెరిగాయి. యూకే, ఈయూ,  కెనడా, ఇజ్రాయెల్ మొదలైన వాటితో కొనసాగుతున్న వాణిజ్య చర్చలు కూడా మన ఎగుమతులకు మరింత ఊపునిస్తాయని ఫెడరేషన్​ ఆఫ్ ఇండియన్​ ఎక్స్​పోర్ట్స్​ ఆర్గనైజేషన్​ ప్రెసిడెంట్​ శక్తివేల్ అన్నారు. జియోపొలిటికల్ టెన్షన్లు, గ్లోబల్​ మార్కెట్లలో ఆర్థిక సమస్యలు, క్రూడాయిల్​ కొరత కారణంగా మాన్యుఫాక్చరింగ్​ ఎక్స్​పోర్ట్స్ మాత్రం​ బలహీనంగా ఉన్నాయి.  ఈ పరిస్థితుల వల్ల కొన్ని మార్కెట్లకు మన ఎగుమతులు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిమ్​ బ్యాంక్​ పేర్కొంది. 

ఫిబ్రవరిలో తగ్గుదల...

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎగుమతులు  37.15 బిలియన్ డాలర్ల నుండి 33.88 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దిగుమతులు పోయిన ఏడాది ఇదే నెలలో  55.9 బిలియన్ డాలర్ల నుండి  51.31 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఫిబ్రవరిలో సరుకుల దిగుమతులు ఎనిమిది శాతం,  ఎగుమతులు ఎనిమిది శాతానికి పైగా తగ్గాయి.  సరుకుల ఎగుమతులు 2022 డిసెంబర్ లో 12.2 శాతం నుంచి ఈ ఏడాది జనవరిలో 6.58 శాతానికి తగ్గాయి. ఎగుమతులు మినహా అన్ని రంగాల్లో గ్రోత్​ బాగుండవచ్చని ఇటీవల ఆర్​బీఐ తెలిపింది. ఇందుకు గ్లోబల్​ మార్కెట్లలో సమస్యలే కారణమని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం జనవరిలో సేవల ఎగుమతులు 49.1 శాతం పెరగడంతో ఇండియా ట్రేడ్​  డెఫిసిట్​1.27 బిలియన్​ డాలర్లకు తగ్గింది. గడచిన 19 నెలల్లో ఇది ఇంత తక్కువగా ఉండటం మొదటిసారి. ఇండియా ఎగుమతులు భారీగా పెరుగుతుండటానికి ముఖ్య కారణమని సర్వీసుల ఎగుమతులేనని  కేంద్ర కామర్స్​ సెక్రెటరీ సునీల్​ భర్త్​వాల్ అన్నారు. ఫారిన్​ మార్కెట్లలో సమస్యలు ఉన్నప్పటికీ ఈ ఊపు కొనసాగుతుందని ఆశాభావం ప్రకటించారు. కేంద్ర కామర్స్​, ఇండస్ట్రీ మినిస్టర్​ పీయుష్​ గోయల్​ కూడా రికార్డు స్థాయి సరుకుల, సేవల ఎగుమతులు సాధిస్తామని ఇటీవల అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతుల విలువ 750 బిలియన్​ డాలర్లకు చేరవచ్చని చెప్పారు. చాలా దేశాలతో  రూపాయి వాణిజ్యం పెరుగుతుండటం వల్ల ఎగుమతులూ అధికమవుతాయని వివరించారు. ఎగుమతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం యూఏఈ, ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్​ అగ్రిమెంట్లను కుదుర్చుకుంటోంది.