2027 World Cup: వరుసగా మూడు సెంచరీలు కొట్టిన గ్యారంటీ ఇవ్వలేం.. యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ రావొచ్చు: అగార్కర్

 2027 World Cup: వరుసగా మూడు సెంచరీలు కొట్టిన గ్యారంటీ ఇవ్వలేం.. యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ రావొచ్చు: అగార్కర్

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే భవిష్యత్ డైలమాలో పడింది. టీ20, వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ద్వయం.. ఒక్క ఫార్మాట్ ఆడడం మైనస్ గా మారింది. వీరిద్దరూ టార్గెట్ చేసిన 2027 వన్డే ప్రపంచ కప్ ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సీనియర్ ప్లేయర్లు అయినప్పటికీ వీరు వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగుతారనే గ్యారంటీ లేదు. ఈ సీనియర్ ప్లేయర్స్  ఫామ్, ఫిట్ నెస్ తో ఉంటేనే 2027 వరల్డ్ కప్ ఆడగలరు. 

అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ లో వీరిద్దరూ ఆడబోతున్నారు. ఏడు నెలల తర్వాత రోకో జోడీ అంతర్జాతీయ క్రికెట్ లో బరిలోకి దిగనుండడంతో భారీ హైప్ నెలకొంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 19) ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్ కు ముందు  టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. రోహిత్, విరాట్ కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అగార్కర్ మాట్లాడుతూ ఇలా అన్నాడు..   

"రోహిత్, కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడడం గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం తెలివితక్కువ తనం అవుతుంది. ఒకరు 50 కంటే ఎక్కువ యావరేజ్ (కోహ్లి 57.9) మరొకరు 50కి (రోహిత్, 48.8) దగ్గరగా యావరేజ్ ఉంది. 2027 చాలా దూరంలో ఉంది. వారు ఒకే ఫార్మాట్‌లో ఆడుతున్నారు. మార్చి 9న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత అక్టోబర్ 19న అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నారు. వారి ఆటను బట్టి అంచానా వేస్తాం.  వారు సాధించాల్సిన పరుగులు, గెలవాల్సిన ట్రోఫీలు గెలిచారు. ఆస్ట్రేలియా సిరీస్ లో విఫలమైనంత మాత్రాన వారు జట్టులో ఉండరని అర్ధం కాదు. అదే విధంగా మూడు మ్యాచ్ ల్లో సెంచరీ చేసినంత మాత్రాన జట్టులో ఉంటారని గ్యారంటీ ఇవ్వలేం. 

అప్పటికీ పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని బట్టి మేము ముందుకు సాగుతాం. మ్యాచ్ లు ఆడుతున్న కొద్ది జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందో ఒక ఐడియా వస్తుంది. కోహ్లీ, రోహిత్ చాలాకాలంగా భారత జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు. వారి గురించి మాట్లాడడానికి ఇది సరైన వేదిక కాదు. రానున్న రెండు సంవత్సరాలలో జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతం జట్టు విజయలపైనే దృష్టి పెట్టాం. వారిద్దరి స్థానంలో మరికొందరు యువ ఆటగాళ్లు కూడా ఆడొచ్చు". అని అగార్కర్ తెలిపాడు. 

వరల్డ్ కప్ కు మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడడంతో వారి ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. వీరిద్దరూ ఆ సమయానికి ఫిట్ నెస్ తో పాటు ఫామ్ లో ఉంటారంటే ఖచ్చితంగా చెప్పాలని పరిస్థితి. టెస్ట్ క్రికెట్ లో పేలవ ఫామ్ కారణంగానే ఈ ఇద్దరూ సుదీర్ఘ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఒక్క ఫార్మాట్ ఆడడంతో వీరి ఫామ్ ప్రస్నార్ధకంగా మారింది. బీసీసీఐ కూడా రోహిత్, కోహ్లీ జోడీ ఖచ్చితంగా జట్టులో ఉంటారనే గ్యారంటీ ఇవ్వలేకపోతుంది.