అమెరికా టారిఫ్లతో ఎగుమతులకు దెబ్బ.. ఆగస్టులో 16.3 శాతం తగ్గుదల.. జీటీఆర్ఐ వెల్లడి

అమెరికా టారిఫ్లతో ఎగుమతులకు దెబ్బ.. ఆగస్టులో 16.3 శాతం తగ్గుదల.. జీటీఆర్ఐ వెల్లడి

న్యూఢిల్లీ: మనదేశంపై అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా యూఎస్​కు భారతదేశం నుంచి చేసే ఎగుమతులు వేగంగా తగ్గుతున్నాయి. ఈ సుంకాలు వాషింగ్టన్ మార్కెట్లో మన దేశ వస్తువుల ధరల పోటీతత్వాన్ని దెబ్బతీస్తున్నాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్​ఐ) అనే థింక్ ట్యాంక్ తెలిపింది. 

దీని రిపోర్ట్​ ప్రకారం.. జులై నెలతో పోలిస్తే ఆగస్టులో ఎగుమతులు 16.3 శాతం తగ్గి 6.7 బిలియన్ డాలర్లకు చేరాయి. దీనికి ప్రధాన కారణం.. నెల చివరి నాటికి అమెరికా సుంకాలు 50 శాతానికి పెరగటమే. ఈ ఏడాది మేలో ఎగుమతులు 4.8 శాతం పెరిగి 8.8 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. ఏప్రిల్‌‌‌‌లో ఎగుమతుల విలువ 8.4 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ నెలల్లో పెరుగుదల కనిపించడానికి కారణం.. సుంకాలు పెరగకముందే దిగుమతిదారులు ఆర్డర్లు ఇవ్వడం. 

మే నెలతో పోలిస్తే జూన్​లో ఎగుమతుల విలువ 5.7 శాతం తగ్గి 8.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. సుంకం ప్రభావం జూన్​ నుంచి కనిపించింది. దీంతో ఆర్డర్లు వేరే సరఫరాదారులకు మళ్లాయి. జూన్ నెలతో పోలిస్తే జులైలో ఎగుమతులు 3.6 శాతం తగ్గి 8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.  ఈ ఏడాది ఏప్రిల్ 4 వరకు భారత వస్తువులు అమెరికా మార్కెట్​లోకి సాధారణ ఎంఎఫ్​ఎన్​ (మోస్ట్ ఫేవర్డ్ నేషన్) రేట్లపై ప్రవేశించాయి. ఏప్రిల్ 5 నుంచి అమెరికా 10 శాతం సుంకం విధించింది. ప్రారంభంలో ఇది ప్రభావం చూపనప్పటికీ, క్రమంగా ఎగుమతుదారులకు నష్టాలు మొదలయ్యాయి.

వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో

అసలైన దెబ్బ ఆగస్టులో తగిలింది. గత నెల 7న సుంకాలు 25 శాతానికి,  27వ తేదీన చాలా వస్తువులపై 50 శాతానికి పెరిగాయి. దీంతో ఎగుమతిదారులకు సర్దుబాటు చేయడానికి చాలా తక్కువ సమయం లభించింది.  సెప్టెంబర్ నెలలో 50 శాతం రేటు పూర్తిగా అమలు అవుతుంది కాబట్టి మరింత తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

భారతదేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో సుమారు మూడో వంతు (ఫార్మాస్యూటికల్స్, స్మార్ట్​ఫోన్ల లాంటివి) సుంకాల నుంచి మినహాయించారు. ఈ మినహాయింపు ఉన్నా, మిగిలిన వస్తువులపై ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. దుస్తులు, రత్నాలు ఆభరణాలు, తోలు, రొయ్యలు, తివాచీలు లాంటి శ్రమ- ఆధారిత రంగాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. 

ఎందుకంటే ఈ రంగాల గ్లోబల్ ఎగుమతుల్లో అమెరికా వాటా 30 నుంచి 60 శాతం కంటే ఎక్కువ ఉంది.  50 శాతం సుంకాలు 2026 ఆర్థిక సంవత్సరం చివరి వరకు కొనసాగితే, భారతదేశం అమెరికా ఎగుమతుల్లో 30–-35 బిలియన్ డాలర్లు కోల్పోవచ్చని జీటీఆర్​ఐ తెలిపింది.