- ఫిర్యాదుల పరిష్కారానికి డెడ్‌లైన్.. అప్పీల్ వ్యవస్థ తీసుకురావాలి
- కంప్లయింట్స్ పరిష్కారానికి అన్ని స్థాయిల్లో ఆఫీసర్లకు పూర్తి అధికారాలు
- జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్‌టైం డిజిటల్ మానిటరింగ్
- ప్రతిస్థాయిలో నోడల్ అధికారుల నియామకం చేపట్టాలని ఆదేశం
- సీఎస్, సీఎంవో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వెంటనే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని సూచించారు. తర్వాత దశలో మండల స్థాయికి విస్తరించాలన్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్నిస్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని తెలిపారు.
ఆదివారం ఉదయం ఎంసీహెచ్‌ఆర్‌డీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు, జిల్లా కేంద్రానికి వచ్చే బదులు ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సీఎం రేవంత్ అన్నారు. ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలని, సంబంధిత విభాగాలకు పంపించాలని, పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు ఉండాలని, ఆలస్యం జరగకూడదని చెప్పారు. ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలని ఆదేశించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్ టైమ్ మానిటరింగ్ ఉండాలని సూచించారు. ప్రతి స్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు.
పేరుకు డిస్పోజ్.. సమస్య అక్కడే
ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజే 2023 డిసెంబర్ 8న ప్రజావాణి కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి మంగళవారం, శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అయితే ప్రజావాణికి ప్రస్తుతం అదనపు బాధ్యతలు ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 7.02 లక్షల ఫిర్యాదులు రాగా, అందులో 6.22 లక్షలకు పైగా పరిష్కరించామని (డిస్పోజ్డ్) లెక్కలు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన ఊరిలో భూభారతితో సమస్య వల్ల భూమి పట్టా కావడం లేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. సదరు దరఖాస్తు జిల్లా కలెక్టరేట్ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తుంది.
క్షేత్ర స్థాయిలో సమస్యను పరిష్కరించి పట్టా ఇవ్వడానికి బదులు, తహసీల్దార్ ఆ దరఖాస్తుపై ‘ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పరిశీలనలో ఉంది’ లేదా ‘పై అధికారుల మార్గదర్శకాలు రావాల్సి ఉంది’ అని ఒక రిమార్క్ రాస్తారు. వెంటనే ఆ రిమార్క్‌ను సిస్టమ్‌లో అప్‌లోడ్ చేసి అని మార్క్ చేస్తారు. బాధితుడికి సమస్య తీరదు కానీ, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఆ ఫిర్యాదు పరిష్కారమైనట్లు లెక్కల్లోకి వెళ్లిపోతుంది. కేవలం సమాధానం ఇవ్వడమే పరిష్కారంగా అధికారులు భావిస్తుండటం వల్ల పెండింగ్ జాబితా తక్కువగా కనిపిస్తున్నది.
దివ్యదేవరాజన్పై పనిభారం.. తగ్గిన మానిటరింగ్!
పంచాయతీరాజ్ కమిషనర్‌గా, సెర్ప్ సీఈవోగా కీలక బాధ్యతల్లో ఉన్న దివ్య దేవరాజన్‌కు ప్రజావాణి అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆమెకు పనిభారం పెరిగి పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో ఉన్న ఉత్సాహం అధికారుల్లో మచ్చుకైనా కనిపించడం లేదని, జిల్లాల్లో కలెక్టర్లను సమన్వయం చేయడంలో యంత్రాంగం విఫలమవుతోందని బాధితులు చెబుతున్నారు.
పంచాయతీరాజ్ లాంటి శాఖతో పాటు సెర్ప్ బాధ్యతలు చూస్తూ, ప్రతి వారం వేల సంఖ్యలో వచ్చే ప్రజావాణి అప్లికేషన్లను ట్రాక్ చేయడం సవాలుగా మారింది. దీనివల్ల వివిధ శాఖల హెచ్‌వోడీలు, జిల్లా కలెక్టర్లతో జరగాల్సిన నిరంతర సమీక్షలు మందగించాయి. అధికారులు పంపే అరకొర సమాధానాలను క్షుణ్నంగా పరిశీలించే వ్యవస్థ ఉండటం లేదు.
ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయాలి
ప్రతి జిల్లాలోనూ, ప్రతి శాఖలోనూ ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలని , ఒకస్థాయిలో పరిష్కారం కాకపోతే, పైస్థాయి అధికారికి అర్జీ అందేలా ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
డ్యాష్ బోర్డ్ ద్వారా పరిష్కార పురోగతి తెలుసుకునే వీలుండాలని, ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని చెప్పారు. ప్రజావాణి సేవలను వికేంద్రీకరించడంతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెండింగ్ అర్జీల సంఖ్య తగ్గుతుందని, కిందిస్థాయిలోనే కొన్ని పరిష్కరించే వీలుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలని సూచించారు.

