రాష్ట్రానికి తీరని అన్యాయం.. కేంద్ర బడ్జెట్ పై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్రానికి తీరని అన్యాయం..  కేంద్ర బడ్జెట్ పై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం కేంద్ర బడ్జెట్‌‌పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన అంశాలపై కూడా బీజేపీ సర్కారు బడ్జెట్ లో వివక్ష చూపిందని విమర్శించారు. రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం అత్యంత దుర్మార్గమని  అన్నారు. 

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ లో తెలంగాణ పదాన్ని పలకకపోవడం దారుణమని తెలిపారు. ఆమె రాజ్యాంగస్ఫూర్తి ప్రదర్శించలేదని చెప్పారు. పునర్విభజన చట్టం ప్రకారం కేటాయింపులు జరపలేదన్నారు. గతంలో ఇచ్చిన35 హామీలకు సంబంధించిన ఊసే లేకుండా పోయిందన్నారు. విభజన చట్టం పేరుతో ఏపీకి నిధులు ఇస్తే తమకు అభ్యంతరం లేదని అదే విధంగా తెలంగాణకు నిధులు కేటాయిస్తే బాగుండేదని పేర్కొన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ, వెనుకబడిన జిల్లాలకు ప్రోత్సాహం, ఐఐఎమ్ కు మొండి చేయి చూపించారన్నారు. 

రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా ఢిల్లీపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నదని వెల్లడించారు. రాష్ట్రాల్లో ఎకనామీ అభివృద్ధి చెందకుకండా దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని మంత్రి శ్రీధర్​బాబు ప్రశ్నించారు. టూరిజానికి గుర్తింపు ఇస్తామని బడ్జెట్​లో ప్రకటించినా రాష్ట్రంలో ఉన్న రామప్ప వంటి టూరిజం ప్రాంతాలకు నిధులపై స్పష్టత ఇవ్వలేదన్నారు. బల్క్​డ్రగ్ ఇండస్ట్రీకి హైదరాబాద్​ కేపిటల్ అని హైదరాబాద్ కేంద్రంగా ఫార్మాసిటీని అభివృద్ధి చెయ్యాల్సి ఉందని స్పష్టం చేశారు. 

అయితే, రాష్ట్రాన్ని కాదని హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఏపీకి నిధులు ఇచ్చారని తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపారని విమర్శించారు. మెడికల్ డివైజెస్​పార్క్, బల్క్ డ్రగ్ ఎకోసిస్టమ్ ఉన్నా తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. వరంగల్​గ్రీన్​ఫీల్డ్​మెగాటెక్స్​టైల్ పార్కునుబ్రౌన్​ ఫీల్డ్​గా మార్చారని, నిధులను పెండింగ్​లో ఉంచారన్నారు. బడ్జెట్ లో పెండింగ్​ గ్రాంట్ల ప్రస్తావనే లేదన్నారు. తెలంగాణ హక్కులను కాలరాసేలా కేంద్ర బడ్జెట్​ ఉందన్నారు.