సర్కార్​ తీరు వల్ల తహసీల్దార్లపై తీవ్ర ఒత్తిడి

సర్కార్​ తీరు వల్ల తహసీల్దార్లపై తీవ్ర ఒత్తిడి
  • ‘ప్రక్షాళన’ లోపాలతోనే పంచాయితీ!
  • భూవివాదాల పరిష్కారానికి మార్గం చూపని ప్రభుత్వం
  • టెక్నికల్‌‌ ఎర్రర్స్‌‌కూ రెవెన్యూ ఉద్యోగులు బద్నాం
  • ట్రాన్స్‌‌ఫర్స్ చేయాలని ఎన్నిసార్లు అడిగినా స్పందన కరువు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం ప్రారంభించిన భూరికార్డుల  ప్రక్షాళన ఊళ్లల్లో పెండింగ్‌‌‌‌ సమస్యలను పరిష్కరించకపోగా.. కొత్త పంచాయితీలకు కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏండ్ల తరబడి కాస్తులో ఉన్న రైతుల పేర్లు, సాదాబైనామాలపై భూములు కొనుగోలు చేసినవారి పేర్లు రికార్డుల్లోకి ఎక్కుతుందని అంతా భావించినప్పటికీ గ్రౌండ్​ లెవల్​లో భూరికార్డుల ప్రక్షాళనే అనేక కొత్త సమస్యలకు కారణమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ రికార్డుల నమోదుకు ఐఎఫ్‌‌‌‌ఎల్ఎస్‌‌‌‌ అనే సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ సంస్థతో ఒప్పదం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ధరణి’ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ లోపభూయిష్టంగా ఉండడంతో తహసీల్దార్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్వర్‌‌‌‌ డౌన్‌‌‌‌తో పగలూ, రాత్రి పనిచేసినా మ్యుటేషన్లు పూర్తి చేయలేకపోయారు.

ధరణి తప్పిదాలను, లోపాలను సరిచేయాలని రెవెన్యూ అధికారులు, సిబ్బంది కోరుతున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం సరిచేయకపోగా చివరికి తమనే కొన్నాళ్లుగా దోషులుగా చిత్రీకరిస్తూ వస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమ ఉద్యోగులను అవినీతిపరులుగా ముద్ర వేసి ప్రచారం చేస్తే తాము ప్రజల్లో చులకనవుతున్నామని, దాడులు జరిగే ప్రమాదముందని ఒకవైపు రెవెన్యూ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగానే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్‌‌‌‌ తహసీల్‌‌‌‌ ఆఫీసులో సోమవారం జరిగిన తహసీల్దార్‌‌‌‌ విజయారెడ్డి సజీవ దహనం ఆ శాఖ ఉద్యోగులను షాక్‌‌‌‌కు గురి చేసింది. విజయారెడ్డి హత్యతో భూరికార్డుల ప్రక్షాళన తెచ్చిన చిక్కులు, తహసీల్దార్లపై ఉన్న ఒత్తిళ్లు ఇటు రెవెన్యూ శాఖలో.. అటు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.

భూరికార్డుల ప్రక్షాళనలో జరిగేందేమిటి ?

రాష్ట్రంలో ప్రస్తుత భూరికార్డులను సరిచేయడంతోపాటు భవిష్యత్‌‌‌‌లో భూముల అమ్మకం, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్‌‌‌‌, వారసత్వ హక్కులు, పేరు మార్పిడి (మ్యుటేషన్‌‌‌‌), తదితర ప్రక్రియలన్నీ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌‌‌‌ 15న భూరికార్డుల ప్రక్షాళనను ప్రారంభించింది. మూడు, నాలుగు దశాబ్దాలుగా పెండింగ్‌‌‌‌లో ఉన్న లక్షలాది సమస్యలను కేవలం వంద రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులకు టార్గెట్‌‌‌‌ విధించి వారిపై ఒకింత తీవ్రమైన ఒత్తిడి పెంచింది. ఫలితంగా అనేక పొరపాట్లకు అవకాశమేర్పడింది. అప్పటి వరకు పట్టాదార్‌‌‌‌ పాస్‌‌‌‌ పుస్తకాలు కలిగిన లక్షలాది మంది రైతులకు కొత్త పాస్‌‌‌‌పుస్తకాలు రాకపోవడం, వచ్చినవారికి భూమి విస్తీర్ణం తక్కువగా నమోదు కావడంలాంటి సమస్యలు తలెత్తాయి.

భూములు ఎప్పుడో అమ్మేసిన వ్యక్తులు భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా భూమి తమదేనని, అప్పుడు తక్కువ ధరకు ఇచ్చామని ఎదురుతిరిగిన ఘటనలు వేలాదిగా వెలుగు చూశాయి. అంతేగాక రకరకాల కారణాలతో ఊళ్లు వదిలివెళ్లిన భూస్వాములు భూరికార్డుల ప్రక్షాళన పుణ్యమాని మళ్లీ వచ్చి తమ పేరిటే పట్టాలివ్వాలని పిటిషన్లు ఇచ్చారు. వాస్తవానికి ఇలాంటి సమస్యలకు పరిష్కారం తహసీల్దార్ల చేతుల్లోనూ లేకపోవడం, ఈ  భూములన్ని పార్ట్‌‌‌‌ –బీ జాబితాలో పెట్టడంతో ఇప్పటికీ రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రాష్ట్రంలో ఇంకా సుమారు 8 లక్షల 90 వేల పట్టాదార్‌‌‌‌ పాస్‌‌‌‌ పుస్తకాల జారీ పెండింగ్‌‌‌‌లో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ ఘటనకు కారణమైన అబ్డుల్లాపూర్‌‌‌‌పెట్​ మండలం గౌరెల్లిలోనే  క్లియరెన్స్‌‌‌‌ కోసం 270 సర్వే నంబర్లు పెండింగ్‌‌‌‌లో ఉండడం సమస్యకు అద్దం పడుతోంది. సర్వే నంబర్ల క్లియరెన్స్‌‌‌‌ తహసీల్దార్ల పరిధిలో లేకపోయినా ప్రజలు మాత్రం వారిపైనే  కోపం పెంచుకోవడం ఇబ్బందికరంగా మారింది.

ట్రాన్స్‌‌‌‌ఫర్స్‌‌‌‌ చేసి ఉంటే బతికేదేమో..! 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర జిల్లాలకు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేసిన తహసీల్దార్లను పాత జిల్లాలకు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేయాలని గత ఆరు నెలలుగా తహసీల్దార్ల సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందన లేదు. ఓ దశలో సామూహిక సెలవులకు సిద్ధమైన తహసీల్దార్లు.. వర్క్‌‌‌‌ టు రూల్‌‌‌‌ పాటిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హయత్‌‌‌‌ నగర్‌‌‌‌ మండలం నుంచి అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్‌‌‌‌ మండలం కొత్తగా ఏర్పడినప్పుడు తహసీల్దార్‌‌‌‌గా నియామకమైన విజయారెడ్డి మూడేండ్లుగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు.

రకరకాల ఒత్తిళ్లను తట్టుకోలేక విజయారెడ్డి సైతం తనను ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేయాలని పలుమార్లు ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. తహసీల్దార్ల ట్రాన్స్‌‌‌‌ఫర్లు చేసి ఉంటే ఇలాంటి దారుణం జరిగి ఉండేది కాదని తహసీల్దార్ల సంఘం నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ సిబ్బందిపై సీఎం చేసిన వ్యాఖ్యల తర్వాత అభద్రత భావం పెరిగిందని, ప్రజల్లోనూ చులకనయ్యామని వాపోయారు. ప్రభుత్వ విధానాలు ఉద్యోగుల పాలిట శాపంగా మారాయన్నారు.