21మందిని గుర్తించిన ‘దర్పణ్’

21మందిని గుర్తించిన ‘దర్పణ్’
  • తప్పిపోయిన చిన్నారుల ఆచూకీని ఈ యాప్ తో తెలుసుకుంటున్న పోలీసులు
  • ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్ వేర్ లో లక్షకు పైగా నేరగాళ్ల డేటా
  • ‘టీఎస్ కాప్’ యాప్ కి లింక్ చేసిన పోలీస్ డిపార్ట్ మెంట్

హైదరాబాద్,వెలుగు:పోలీసులు టెక్నాలజీ సాయంతో మిస్సింగ్ చిన్నారులను తల్లిదండ్రుల దగ్గరికి చేరుస్తున్నారు. అందుకోసం పోలీసులు ఉపయోగిస్తున్న ఫేస్ రికగ్నైజేషన్,దర్పణ్ టూల్స్ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. దర్పణ్ టూల్ తో మిస్సింగ్ చిన్నారులను పోలీసులు కనిపెడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ‘దర్పణ్’​యాప్ తో 21 మంది చిన్నారులను పోలీసులు గుర్తించారు. దర్పణ్ యాప్ తో పాటు ఫేస్ రికగ్నైజేషన్ టూల్ ను ‘టీఎస్ కాప్’ యాప్ కి లింక్ చేసి నేరగాళ్ళపై కదలికలపై నిఘా పెట్టారు. రాష్ట్రంలో అదృశ్యమైన వారి వివరాలతో పాటు, పోలీస్ రికార్డ్స్ లో ఉన్న పాత నేరస్థులు,అంతరాష్ట్ర దొంగల ముఠాలు,అనుమానాస్పద వ్యక్తుల డేటా బేస్ ను వీటిలో అప్ లోడ్ చేశారు.

మీర్ పేట మిస్సింగ్ కేసు

రంగారెడ్డి జిల్లా మీర్ పేటలో కమల్(6) 2017 డిసెంబర్ లో తప్పిపోయాడు. కమల్ ను ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మేడ్చల్ జిల్లా దుండిగల్ లోని ‘కుటుంబం’ ఆశ్రమంలో చేర్చారు. అప్పటి నుంచి  అదే ఆశ్రమంలో ఉంటున్న కమల్ ఆచూకీ సీఐడీ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ కి చిక్కింది. దీంతో మీర్ పేట పోలీసులు 2018 ఆగస్టు 16న ఆశ్రమంలో ఉన్న కమల్ ని తీసుకొచ్చి అతడి పేరెంట్స్ కి అప్పగించారు.

బహూదూర్ పుర చిన్నారి..మధ్యప్రదేశ్ లో

2017 జనవరి 4న నమోదైన మిస్సింగ్ కేసులో చిన్నారి ఆచూకీని దర్పణ్ కనిపెట్టింది. ఈ కేసు దర్యాప్తును చేపట్టిన సీఐడీ ఐటీ వింగ్  ఫేస్ రికగ్నేషన్ టూల్ తో చిన్నారి మధ్యప్రదేశ్ లో ఉన్నట్టు గుర్తించింది. మధ్యప్రదేశ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులను సంప్రదించి బెతూల్ లోని చైల్డ్ హోమ్ లో ఉన్న ఆ చిన్నారిని ఈ ఏడాది ఫిబ్రవరి 16న తల్లిదండ్రుల వద్దకు చేర్చింది.

ఆపరేషన్ ముస్కాన్

ఈ ఏడాది జూలై 1 నుంచి 31 వరకు రాష్ట్రంలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-–5 లో రాచకొండ,వరంగల్‌‌ కమిషనరేట్లలో దర్పణ్ యాప్ తో ముగ్గురు చిన్నారులను పోలీసులు గుర్తించారు.దర్పణ్ యాప్ లో అందుబాటులో ఉన్న 2,635 మంది చిన్నారుల మిస్సింగ్ కేసులను రాచకొండ పోలీసులు పరిశీలించారు. ఇందులో  హాస్టల్, ఇంటి నుంచి తప్పిపోయిన ఇద్దరిని గుర్తించారు. వరంగల్ లో తప్పిపోయిన మరో చిన్నారిని గుర్తించారు.

ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు

మరో వైపు ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌‌వేర్‌‌ను ఉపయోగించి క్రిమినల్స్ ను పోలీసులు గుర్తిస్తున్నారు. సిటీలో నేరగాళ్ళ కదలికలపై నిఘా  పెట్టారు.సిటీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఫేస్ రికగ్నేజేషన్,టీఎన్ కాప్ యాప్స్ కి కనెక్ట్ చేశారు. సికింద్రాబాద్,నాంపల్లి రైల్వే స్టేషన్ లతో పాటు ఎంజీబీఎస్ లో ఫేస్ రికగ్నేషన్ కెమెరాలను ఫిక్స్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి ముఖాన్ని స్కాన్ చేస్తున్నారు. అనుమానితుల పోలీస్ క్రైమ్ రికార్డుల్లో ఉన్న డేటాతో పోల్చి చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షకు పైగా నేరగాళ్ళ డేటాను ఈ ఫేస్ రికగ్నైజేషన్ టూల్ లో పొందుపరిచారు.పాత నేరస్థుల ఫింగర్ ఫ్రింట్స్,ఫొటోలతో పాటు అంతర్రాష్ట్ర దొంగలు, క్రిమినల్స్ డేటాను టీఎస్ కాప్ యాప్ లో అప్ లోడ్ చేశారు. ఇందులో మిస్సింగ్ కేసుల్లో సేకరించే ఫొటోలను పూర్తి వివరాలతో నిక్షిప్తం చేస్తున్నారు. ప్రత్యేక ఐటీ విభాగం ఆధ్వర్యంలో సిటీలోని సీసీ ఫుటేజ్ లను  ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.