టీకా వేసుకుంటే మనిషి చింపాజీ అయితడని ఫేక్‌ ప్రచారం

టీకా వేసుకుంటే మనిషి చింపాజీ అయితడని ఫేక్‌ ప్రచారం

కరోనా టీకాలపై విష ప్రచారం చేస్తున్న వారిపై ఫేస్‌బుక్ కఠినంగా వ్యవహరిస్తోంది. తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేసే వాళ్ల అకౌంట్లను బ్యాన్ చేస్తోంది. తాజాగా 300 అకౌంట్లను నిషేధించినట్లు ప్రకటించింది.  ఆస్ట్రాజెనికా (కొవిషీల్డ్), ఫైజర్ కంపెనీల కరోనా వ్యాక్సిన్లు వేసుకుంటే మనిషి.. పూర్తిగా చింపాజీలా మారిపోతాడని ఫేక్ ప్రచారాలు చేశారని పేర్కొంది. ఆ అకౌంట్లన్నీ రష్యాకు చెందినవేనని తెలిపింది. ఇండియా, యూఎస్, లాటిన్ అమెరికా దేశాలకు చెందిన యూజర్లను టార్గెట్ చేసి, ఈ తప్పుడు ప్రచారం చేశారని తెలిపింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వేసుకున్న మనుషులు చింపాజీల్లా మారిపోతున్నారంటూ తొలిసారిగా గత ఏడాది డిసెంబర్‌‌ నెలలో పోస్టులు చేశారని, ఆ తర్వాత ఆ అకౌంట్లు పూర్తిగా యాక్టివిటీ లేకుండా ఉండిపోయాయని చెప్పింది. ఐదు నెలల గ్యాప్ తర్వాత ఈ ఏడాది మే నెలలో మళ్లీ అదే పోస్టును మార్చి ఫైజర్‌‌ టీకా వల్ల మనుషులు చింపాజీలుగా మారిపోతున్నారని పోస్ట్ చేశారు. ఈ అకౌంట్లను రష్యాకు చెందిన ఒక డిస్‌ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్‌ ఆపరేట్ చేస్తోందని తేలినట్టు ఫేస్‌బుక్ ఇంటెలిజెన్స్ టీమ్ వెల్లడించింది. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో 243, ఫేస్‌బుక్‌లో 65 అకౌంట్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది. ఈ అకౌంట్లలో దాదాపు 10 వేలకు పైగా పోస్టులు చేసి, కరోనా వ్యాక్సిన్లపై విష ప్రచారం చేసినట్లు గుర్తించామని పేర్కొంది. ఇలాంటి ఫేక్ ప్రచారాలపై తమ టీమ్‌ నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపింది.