
- విద్యాశాఖ పరిధిలో నిర్మాణాలన్నీ టీడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలోనే జరగాలి
- కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యమివ్వాలి
- సర్కారు బడుల్లో అవసరమైతే కాంట్రాక్టు పద్ధతిలో పీఈటీలు
- గ్రీన్ ఛానెల్ ద్వారా మిడ్ డే మీల్స్ బిల్లుల చెల్లింపు
- బాలికల గురుకులాల్లో మహిళా కౌన్సెలర్లను నియమించాలని ఆదేశాలు
- విద్యాశాఖపై సీఎం రేవంత్ సమీక్ష
హైదరాబాద్, వెలుగు: స్కూల్స్ నుంచి యూనివర్సిటీల వరకు విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు మరింత పెంచాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు, ప్రొఫెషనల్ కోర్సులు బోధించే కళాశాలలు, యూనిర్సిటీల్లో విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా అటెండెన్స్ విధానం తప్పనిసరి అమలు చేయాలని ఆదేశించారు. దీంతో అటెండెన్స్ పెరగడంతోపాటు ప్రొఫెషనల్ కాలేజీల్లో లోపాలను అరికట్టవచ్చని తెలిపారు.
స్టూడెంట్ల అటెండెన్స్ నుంచి స్కూల్ బిల్డింగుల నిర్మాణం వరకూ ప్రతి అంశంలోనూ క్వాలిటీ పెంచాలని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో విద్యా శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ చేశారు. సెప్టెంబర్5న జరిగే టీచర్స్ డే సెలబ్రేషన్స్, విద్యాసంస్థల్లో వివిధ నిర్మాణాలు, బకాయిలు, ఫేషియల్ అటెండెన్స్, ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజులు, సర్కారు డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు, తదితర అంశాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
విద్యారంగంలో చేయాల్సిన మార్పులపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఎడ్యుకేషన్‌పై పెట్టే ఖర్చును ప్రభుత్వం పెట్టుబడిగా భావిస్తున్నదని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి.. విద్యారంగం అభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి నుంచి మినహాయించాలని కోరినట్లు చెప్పారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల్లో 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారని, దీనిపై ఒక నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఒకేశాఖ కింద నిర్మాణాలు..
విద్యాశాఖ పరిధిలో క్లాస్ రూమ్‌లు, కిచెన్ షెడ్లు, టాయ్‌లెట్లు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం వివిధ విభాగాలు చేపట్టడం సరికాదని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. దీంతో క్వాలిటీ లోపిస్తుందని అన్నారు. ఇకపై ఈ నిర్మాణాలన్నీ విద్య, సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ (టీడబ్ల్యూఐడీసీ) కిందనే జరగాలని ఆదేశించారు. ఈ సంస్థకు అవసరమైన ఇంజినీరింగ్ సిబ్బందిని ఇతర విభాగాల నుంచి డిప్యూటేషన్‌పై తీసుకోవాలని సూచించారు.
మధ్యాహ్న భోజన బిల్లులకు ‘గ్రీన్ చానెల్’
మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని, వాటిని గ్రీన్ చానెల్ ద్వారా వెంటనే చెల్లించాలని సీఎం ఆదేశించారు. ఉమెన్స్ కాలేజీలు, గర్ల్స్స్కూళ్లలో మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. కంటైనర్ కిచెన్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి, కరెంట్‌ను వినియోగించుకోవచ్చని చెప్పారు.
స్కూళ్లలో కాంట్రాక్ట్ పీఈటీలు..
ప్రతి విద్యాసంస్థలో స్పోర్ట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిలో పీఈటీలను నియమించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద పారిశుధ్య పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలిపారు.
గురుకుల పాఠశాలల్లోని బాలికలకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సెలర్లను నియమించాలని ఆదేశించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, తదితరులు పాల్గొన్నారు.
సర్కారు డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు..
సర్కారు డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు సీఎం అనుమతించారు. దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్పాట్ అడ్మిషన్లలో నాన్ లోకల్ స్టూడెంట్లకు అవకాశం ఇస్తే ఏమైనా న్యాయపరమైన చిక్కులు వస్తాయా? లేదా? అనే అంశంపై హైకోర్టు అడ్వకేట్ జనరల్సలహా తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం సుమారు 2 లక్షల వరకూ సీట్లు మిగలడంతో ఇబ్బందులేమీ లేవని అధికారులు తెలిపారు. లోకల్ వారికే ప్రయారిటీ ఇవ్వాలని, వాళ్లు లేకపోతేనే నాన్ లోకల్ అభ్యర్థులకు చాన్స్ ఇవ్వాలని సూచించారు.