కామారెడ్డిలో బోర్ కమిటీలే  కీలకం

కామారెడ్డిలో బోర్ కమిటీలే  కీలకం
  • ఆ కమిటీల్లోని ఓట్ల కోసం అభ్యర్థుల పాట్లు
  • కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 10-20కు పైగా బోర్​ కమిటీలు

కామారెడ్డి, వెలుగు :  కామారెడ్డి మున్సిపాలిటీ వార్డుల్లో  నీటి ఎద్దటి  నివారణకు ఏర్పాటు చేసుకున్న కమ్యూనిటీ బోర్​ కమిటీలు  ఇప్పుడు ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఓటర్లను ఒకేసారి ప్రసన్నం చేసుకొనేందుకు అభ్యర్థులకు ఈ కమిటీలే ఆధారంగా కనిపిస్తున్నాయి.  కామారెడ్డిలో పరిధిలో 49 వార్డులు ఉండగా ఇందులో సగం వార్డులో ని అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కమ్యూనిటీ బోరు కమిటీలు కీలకం కానున్నాయి.  దీంతో  బోర్​ కమిటీల్లోని ఓటర్లను మచ్చిక చేసుకొవటానికి అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు.   

ఆయా వార్డుల్లో ఉన్న బోర్​ కమిటీల మద్దతు కూడగట్టుకునేందుకు బోర్​ కమిటీల్లోని సభ్యులపై ఫోకస్​ చేస్తున్నారు.   ఒక్కో కమిటీలో  10 నుంచి 20 వరకు ఫ్యామిలీలు ఉన్నాయి.  ఈ లెక్కన  50 నుంచి 100కు పైగా ఓట్లు ఉంటాయి.  ఒక్కో వార్డులో  కనీసం  5కు పైగా కమ్యూనిటీ బోర్​ కమిటీలు ఉన్నాయి.  కొన్ని వార్డులో వీటి సంఖ్య ఎక్కువ.   ఈ కమిటీల్లోని ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కమిటీల్లోని సభ్యులతో ప్రత్యేకంగా మీటింగ్​లు ఏర్పాటు చేస్తున్నారు. 

ఏమిటీ కమిటీలు.. 

గతంలో  కామారెడ్డి టౌన్​లో విపరీతంగా నీటి  సమస్య ఉండేది. ఎండ కాలం వస్తే..  పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేది.   ఆయా కాలనీల్లో  500 నుంచి 600 పీట్ల లోతు వరకు బోర్​ తవ్వించిన నీళ్లు పడేవి కావు.    ఇంకా ఎక్కువ లోతులో బోర్ తవ్వితే అధిక ఖర్చు అయ్యేది.  కాలనీల్లో  10 నుంచి 20 ఇండ్ల వాళ్లు కలిసి   ఇంటికి కొన్ని పైసలు వేసుకొని 600 నుంచి వెయ్యి ఫీట్ల లోతు వరకు బోర్ తవ్వించుకొని స్పెషల్ పైపులైన్​ వేసుకొని  నీళ్లు సప్లయ్​ చేసుకుంటారు.  ఈ బోర్​ పరిధిలోని  సభ్యులంతా కలిసి కమిటీ ఏర్పాటు చేస్తున్నారు.

 ఈ కమిటీలు కాస్త.. ఓట్లపై కూడా ప్రభావం చూపేలా మారాయి. దీంతో  కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వేర్వేరుగా సమావేశమవుతున్నారు. వారికి హామీలిస్తున్నారు. కమిటీలకు అవసరమైన  సామగ్రి కొనిస్తున్నారు.  బోర్లకు వచ్చే ప్రతి నెల కరంటు బిల్లులు చెల్లిస్తామని చెబుతున్నారు.    

ప్రధానంగా ఈ బోర్​ కమిటీలు కొత్త పట్టణంలో ఎక్కువగా ఉన్నాయి.   వివేకానంద  కాలనీ, విద్యానగర్​, ఆశోక్​నగర్​, శ్రీరాంనగర్​ కాలనీ, ఎన్జీవోస్​ కాలనీ, కాకతీయ నగర్​,  కొత్త సాయి బాబా టెంపుల్​ ఏరియా,   ఆర్యనగర్​, స్నేహా పూరి కాలనీ తదితర ఏరియాల్లో  20 వరకు వార్డులు ఉన్నాయి. కమిటీల్లోని సభ్యులతో  అభ్యర్తులు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు.  దావతులు ఏర్పాటు చేస్తున్నారు. 

 పరిస్థితి ఇది

ప్రస్తుతం మున్సిపల్​ ఎన్నికల దృష్ట్యా పలు వార్డుల్లో బోర్​ కమిటీల్లోని సభ్యులతో అభ్యర్థులు  ప్రత్యేకంగా మీటింగ్​లు ఏర్పాటు చేసి దావత్​లు ఇస్తున్నారు.    కమిటీ ప్రతినిధులు అడిగిన  కోరికలను  అభ్యర్థులు నేరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఇటీవల ఆశోక్​నగర్ కాలనీ, కాకతీయ నగర్, విద్యానగర్​, శ్రీరాంనగర్​ , ఎన్జీవోస్​ కాలనీ తదితర  ఏరియాల్లోని వార్డుల్లో ఉన్న కమిటీలతో ఆయా పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులు సమావేశమయ్యారు.

బోర్లకు సంబంధించిన కరంటు బిల్లులు చెల్లిస్తున్నారు.   కమిటీ సభ్యుల మీటింగ్​లకు అవసరమైన పర్నిచర్​, వంట సామాగ్రి ఇతర వస్తువులు, నజరానాలు ఇస్తున్నారు.  దావతులు ఏర్పాటు  ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి కమిటీలో 50 నుంచి 100 ఓట్లు  ఉన్న దృష్ట్యా అభ్యర్థులు  ప్రత్యేక దృష్ట్యా పెట్టారు.