- కామారెడ్డి జిల్లాలోని ఓ స్కూల్ నుంచి మహారాష్ట్రలోని మరో స్కూల్‌కు డేటా
- కేసు నమోదు చేసిన పోలీసులు, ఆపరేటర్ అరెస్ట్
కామారెడ్డి/పిట్లం, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండల కేంద్రంలోని బ్లూ బెల్స్ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన 167 మంది స్టూడెంట్స్ డేటా చోరీకి గురైంది. పెన్(పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్) కోసం యూ- డైస్లో(యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ఇన్ఫర్మేషన్ సిస్టంఫర్ ఎడ్యుకేషన్) ఎంట్రీ చేసిన 167 మంది విద్యార్థుల డేటా ఇక్కడి నుంచి మహారాష్ట్రలోని మరో స్కూల్‌కు ట్రాన్స్ఫర్ అయింది. సదరు స్కూల్‌కు చెందిన స్టూడెంట్స్ డేటాను ప్రిన్సిపాల్ పరిశీలించగా, 167 మంది స్టూడెంట్స్ డేటా ఆన్లైన్లో కనిపించలేదు. ఇక్కడి నుంచి డేటా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూర్లో ఉన్న జిజామాత స్కూల్‌కు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు.
దెగ్లూర్లో ఉన్న ఆ స్కూల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్‌ను చూపెట్టి అక్కడి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు డేటా ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ యజమానులు ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, శనివారం పిట్లం ఎంఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు డేటా ట్రాన్స్ఫర్లో కీలక పాత్ర పోషించిన బ్లూ బెల్స్ స్కూల్ ఆపరేటర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
కంప్యూటర్ ఆపరేటర్ కీలకపాత్ర..
పిట్లం మండల కేంద్రంలోని బ్లూ బెల్స్ స్కూల్ ఉంది. ఇందులో కొన్నేళ్లుగా అల్కేశ్ అనే వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ప్రభుత్వ ఆదేశాలతో స్కూల్ విద్యార్థుల పూర్తి వివరాలను యూ డైస్లో ఎంట్రీ చేశారు. కొద్ది నెలల కింద స్కూల్ ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ డేటా పరిశీలించగా, 1,386 మంది స్టూడెంట్స్‌కు గాను, 1,219 మంది డేటా మాత్రమే కనిపించింది.
167 మంది స్టూడెంట్స్ సమాచారం ఆన్లైన్లో లేదని గుర్తించి ఆరా తీయగా, మహారాష్ట్రలోని స్కూల్‌కు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. కంప్యూటర్ అపరేటర్ మహారాష్ట్రలోని స్కూల్ యాజమాన్యంతో రూ.4 లక్షలతో ఒప్పందం చేసుకొని, రూ.2 లక్షల అమౌంట్ తీసుకొని డేటాను ట్రాన్స్ఫర్ చేసినట్లు తేలింది. కంప్యూటర్ ఆపరేటర్ అల్కేశ్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామని ఎస్సై వెంకట్రావు తెలిపారు.
