లా నూసియా (స్పెయిన్): బాక్సమ్ ఎలైట్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఇండియా బాక్సర్లు తమ పంచ్ పవర్ చూపెట్టారు. టోర్నీ చివరి రోజైన శనివారం ఏకంగా తొమ్మిది గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకున్న ఇండియా టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గోహైన్, వరల్డ్ యూత్ మాజీ చాంపియన్ అరుంధతి చౌదరి సహా అమ్మాయిలు పోటీ పడ్డ ఏడు ఫైనల్స్‌లోనూ నెగ్గి క్లీన్‌స్వీప్ చేశారు.
75 కేజీల కేటగిరీ ఫైనల్లో లవ్లీనా 4–1 తేడాతో ఇంగ్లండ్‌కు చెందిన మేరీ-కేట్ స్మిత్‌ను చిత్తు చేసింది. అరుంధతి చౌదరి (70 కేజీ) 5–0తో అనస్తాసియా (ఉక్రెయిన్) పై ఏకపక్ష విజయం సాధించింది. 54 కేజీల ఫైనల్లో పూనమ్ 4–1తో ఇండియాకే చెందిన ప్రీతి పవార్‌ను ఓడించి పసిడి గెలిచింది.
ఇతర ఫైనల్స్‌లో మంజు రాణి (48 కేజీ) 5–0తో మార్టా (స్పెయిన్)పై, నీతు (51కేజీ) 5–0తో గుటిరెజ్ (స్పెయిన్)పై నెగ్గగా, ప్రియ (60 కేజీ)5–0తో టెటియానా (ఉక్రెయిన్)ను, నైనా (80 కేజీ) 4–1తో రైసా (ఉక్రెయిన్)ను ఓడించారు. మెన్స్ 60 కేజీ ఫైనల్లో సచిన్ 3–2తో యోమా-అలీ అల్ (కెనడా)పై, ఆకాశ్ (75 కేజీ) 3–2తో అమన్ (కజకిస్తాన్)పై గెలిచి గోల్డ్ మెడల్స్ గెలవగా.. దీపక్ (70 కేజీ), అంకుష్ (80 కేజీ) రజతాలు నెగ్గారు.
